కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది.

కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం (Dandu Malkapur) వద్ద జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న నిడదవోలు (Nidavolu) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అతివేగంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.

ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున వెలుతురు సరిగ్గా లేకపోవడం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Next Story