SBIలో పట్టపగలే తుపాకులు చూపించి భారీ దోపిడీ

by Bhoopathi Nagaiah |

కస్టమర్లతో నిత్యం రద్దీగా ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఓ దొంగల ముఠా టార్గెట్ చేసి విజయవంతంగా భారీ మొత్తంలో డబ్బులను దోపిడీ చేసింది.

SBIలో పట్టపగలే తుపాకులు చూపించి భారీ దోపిడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కస్టమర్లతో నిత్యం రద్దీగా ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఓ దొంగల ముఠా టార్గెట్ చేసి విజయవంతంగా భారీ మొత్తంలో డబ్బులను దోపిడీ చేసింది. పక్కా స్కెచ్‌తో తుపాకులతో బ్యాంకులోకి చొరబడిన దొంగలు నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.50 లక్షల సొత్తును దోచుకోని వెళ్లారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరాచా రోడ్డులో ఉన్న SBI శాఖలో జరిగింది.

సోమవారం ఉదయం బ్యాంకు కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్న సమయంలో, ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు కస్టమర్ల ముసుగులో బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి గాల్లోకి ఊపుతూ సిబ్బందిని, అక్కడ ఉన్న ఖాతాదారులను బెదిరించారు. లోపల ఉన్న వాళ్లు బయటకు దోపిడీ సమాచారం అందించకుండా ఉండేందుకు, దుండగులు అందరి ఫోన్లను లాక్కున్నారు. అనంతరం క్యాషియర్‌కు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి డ్రాయర్లలో, సేఫ్ లాకర్‌లో ఉన్న నగదును బ్యాగుల్లో నింపుకున్నారు. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేస్తామని హెచ్చరించారు. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది మౌనంగా ఉండిపోయారు.

దోపిడీ పూర్తయిన వెంటనే, దొంగలు బయట సిద్ధంగా ఉంచుకున్న వాహనాలపై అత్యంత వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. వారు వెళ్లిన వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సూరత్ పోలీసు ఉన్నతాధికారులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దోపిడీదారులు హెల్మెట్లు, మాస్కులు ధరించి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు బ్యాంకులో దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం నమూనాలను సేకరించారు.

వెంటనే నగరం నలుమూలల పోలీసులు 'నాకాబందీ' (తనిఖీలు) చేపట్టి, అనుమానిత వాహనాలను తనిఖీ చేపట్టారు. పట్టపగలు, రద్దీగా ఉండే వరాచా వంటి ప్రాంతంలో బ్యాంక్ దోపిడీ జరగడం స్థానిక వ్యాపారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. బ్యాంకులో కనీస భద్రతా ఏర్పాట్లు (Security Guards) ఎందుకు విఫలమయ్యాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దొంగతనం జరిగిన నగదు విలువ రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయి ఆడిట్ తర్వాత ఖచ్చితమైన లెక్క తేలనుందని, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story