- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. 28 రోజుల నిఘాతో భారీగా సొమ్ముకాజేసిన కేటుగాళ్లు
సైబర్ కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధికారులమంటూ కాల్స్ వస్తే స్పందించవద్దని ఎంత చెప్పినా ప్రజలు మోసపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. అమాయక ప్రజల భయాన్నే పెట్టుబడిగా మార్చుకుని అడ్డంగా దోచుకుంటున్నారు. ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్‌ను నెలరోజుల పాటు డిజిటల్ అరెస్ట్ లో ఉంచి రూ. 99 లక్షలు దోచుకున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. గాంధీనగర్ సెక్టార్-8లో నివసించే 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌కు జనవరి 16న ఒక గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆమె పేరు మీద ఉన్న సిమ్ కార్డును అక్రమ కార్యకలాపాలకు, బెదిరింపు కాల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారని అవతలి వ్యక్తి భయపెట్టాడు.
CBI అధికారులమంటూ నమ్మబలికి..
కొద్దిసేపటికే అజయ్ గుప్తా అనే వ్యక్తి CBI అధికారిగా పరిచయం చేసుకుంటూ ఆమెకు వీడియో కాల్ చేశాడు. ఒక మనీ లాండరింగ్ కేసులో ఆమె బ్యాంక్ ఖాతాలు లింక్ అయ్యాయని, ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించాడు. బాధితురాలిని మరింత నమ్మించడానికి టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులమంటూ మరికొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు.
నకిలీ వారెంట్లు.. 28 రోజుల పాటు నిఘా
నేరగాళ్లు ఆమెను భయపెట్టేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని పత్రాలను పంపారు. భారత సుప్రీంకోర్టు పేరిట ఉన్న నకిలీ ఉత్తర్వులు, ఫోర్జరీ చేసిన అరెస్ట్ వారెంట్లు, ముంబై క్రైమ్ బ్రాంచ్ రికార్డులు ఉన్నాయి. వీటిని చూసి భయపడిన ఆమెను ఎవరికీ ఫోన్ చేయవద్దని ఆదేశించారు. ఆమె ఎక్కడికి వెళ్తున్నది నిరంతరం మెసేజ్‌ల ద్వారా తెలపాలని ఆదేశిస్తూ, దాదాపు 28 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. ఆమె ఆర్థిక స్థితిని తెలుసుకుని, కేసు నుండి పేరు తొలగిస్తామనే సాకుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఫిబ్రవరి 5 నుండి 13వ తేదీ మధ్యలో ఆమె తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ల నుండి వివిధ ఖాతాలకు RTGS ద్వారా రూ. 99 లక్షలను బదిలీ చేయించుకున్నారు. డబ్బులు పంపిన తర్వాత వారు తిరిగి స్పందించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గాంధీనగర్ రేంజ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు, పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.






