వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా ఎదురింటి కుక్క దాడి.. మహిళ ముఖంపై 50కు పైగా కుట్లు

by Naga Rani Yarlagadda |

ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన మహిళపై కుక్క దాడి చేయడంతో ఆమె ముఖం, తలపై తీవ్రగాయాలు అయ్యాయి.

వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా ఎదురింటి కుక్క దాడి.. మహిళ ముఖంపై 50కు పైగా కుట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన మహిళపై కుక్క దాడి చేయడంతో ఆమె ముఖం, తలపై తీవ్రగాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జనవరి 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 6.54 గంటల సమయంలో మహిళ వాకింగ్ పూర్తి చేసి ఇంటిలోపలికి వెళ్తుండగా.. ఎదురింటివారి కుక్క ఆమెపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఆమెను కుక్క నుంచి విడిపించేందుకు వచ్చిన ఆ ఇంటి వ్యక్తిని కూడా కుక్క రోడ్డుమీదికి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ ముఖం, తలపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఒక కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళకు తల, ముఖం, మెడపై మొత్తం 50కి పైగా కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా.. ఘటన తర్వాత కూడా ఆ ఇంటివారు కుక్కను కట్టేయకపోవడం గమనార్హం. రెండోసారి మహిళ ఇంటిలోకి వెళ్లేందుకు కుక్క ప్రయత్నించగా.. మరో మహిళ దానిని తరిమింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమరేష్ రెడ్డి అనే వ్యక్తి ఆ కుక్కను పెంచుతున్నాడు. అది ఉన్నట్లుండి మహిళపై, ఆమె కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై దాడి చేసింది. కానీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందన్న విషయం వెల్లడించలేదు. ప్రస్తుతం బాధిత మహిళ చికిత్స పొందుతోంది. ఎదురింటివారి నిర్లక్ష్యం కారణంగానే తన భార్యపై పెంపుడు కుక్క దాడి చేసిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఆ కుక్కను పెంచుతున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ఇంత క్రూరమైన కుక్కను పెంచడం నేరంగా పరిగణించాలని, బాధిత మహిళకు నష్టపరిహారం చెల్లించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story