పగలు రెక్కీ..రాత్రి చోరీలు..!

by Chintha Aamani |

పగలు రెక్కీ నిర్వహిస్తూ రాత్రి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

పగలు రెక్కీ..రాత్రి చోరీలు..!
X

దిశ,కామారెడ్డి : పగలు రెక్కీ నిర్వహిస్తూ రాత్రి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 25న భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులో గల రెడిమిక్స్ కంపెనీలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వాచ్ మెన్ లను బెదిరించి మొబైల్, 11 వేల విలువ చేసే ఐరన్ రాడ్లను అపహరించారు. అలాగే 27న రాజంపేట మండలం తలమడ్ల శివారులో గల జెన్ అడ్సోర్పిటేషన్ కంపెనీలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 15 లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు.

ఈ రెండు కేసులలో పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఒకరు, కామారెడ్డిలో నలుగురు, హైదరాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో దొంగిలించిన సొత్తును హైదరాబాద్ ముషీర్ బాగ్ లో విక్రయిస్తారని తేలింది. గతంలో వీరిపై ఆరు కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తానే అలీ, బిర్ధేష్ అలీ, సల్మాన్, మహమ్మద్ సమీర్, చాంద్ బాబు(మైనర్) లు ముఠాగా ఏర్పడి కామారెడ్డి పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీ, ఆదర్శ నగర్ కాలనీల్లో నివాసం ఉంటున్నారు. వీరు చోరీ చేసిన వస్తువులను ముషీరాభాగ్ చేర్చడాని ఆ ప్రాంతానికి చెందిన హాసన్ ఖాన్ అనే వ్యక్తి వాహనాన్ని సమకూరుస్తాడు.

ఆ వాహనంలో ముషీరాభాగ్ తీసుకెళ్లిన వస్తువులను పది నిమిషాల్లో పార్టులుగా విడదీసి కంటికి కనిపించకుండా ఇతర చోటకు తరలిస్తారని ఎస్పీ తెలిపారు. వీరిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక నాలుగు కేసులు ఉన్నాయని, వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్, 1 అట్ఫీ కండెన్సర్, 1 ఎస్ పీ డీ యు, 20 లీటర్ల ట్యాంకులు 3, రెండు రాడ్లు, ఒక బెల్ట్ గార్డ్, ఒక ఎఫ్ ఎఫ్ ఈ, ఒక తర్మసిఫాన్ పాట్, ఒక పైప్ లైన్ (వీటి విలువ 15 లక్షలు), 390 మీటర్ల సోలార్ ప్లాంట్ కాపర్ వైరు, 15 వేల విలువ చేసే సెంట్రింగ్ బాక్సులు, 2.25, 7.5, 2 హెచ్. పి మోటార్లు, ఒక బైకు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన బైకు, 3 మొబైల్స్, ఐరన్ రాడ్డు, టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ చైతన్య రెడ్డి, సిసిఎస్ పోలీసులు పాల్గొన్నారు.

Next Story