వేమునూరి స్వామి హత్య కేసు ఛేదించిన రెబ్బెన పోలీసులు

by Taduka Kalyani |

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ శివారులో జరిగిన వేమునూరి స్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

వేమునూరి స్వామి హత్య కేసు ఛేదించిన రెబ్బెన పోలీసులు
X

దిశ, రెబ్బెన: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ శివారులో జరిగిన వేమునూరి స్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెబ్బెన సీఐ ఎం. సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 15న మృతుడి భార్య వేమునూరి దేవల ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. మృతుడి బంధువైన వైష్ణవి కుటుంబ అనుమతి లేకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడానికి వేమునూరి స్వామే కారణమని భావించిన ఈస్‌గాం మండలం రాసపల్లి గ్రామానికి చెందిన ఇరుగురాల వెంకటేష్, అతని అన్న ఇరుగురాల తిరుపతి హత్యకు పథకం రచించినట్లు గుర్తించారు. జూలై 14 రాత్రి స్వామిని ఇంటి బయటకు పిలిచి మోటార్‌సైకిల్‌పై గ్రామ శివారుకు తీసుకెళ్లి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నేరానికి ఉపయోగించిన కత్తిని, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, మొబైల్ ఫోన్లను ఆధారాలు నశింపజేయాలనే ఉద్దేశంతో వాగులో పడేసి పరారైనట్లు వెల్లడించారు. జూలై 17న కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి కేసుకు సంబంధించిన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్, రక్తపు మరకలున్న దుస్తులు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చూపిన ప్రదేశం నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఇరుగురాల వెంకటేష్, ఇరుగురాల తిరుపతిలను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు పంపినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు.

Next Story