రూ. 200 కోట్ల బినామీ ఆస్తుల వల్లే రియల్టర్ హత్య!

by Bhoopathi Nagaiah |

రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి వివాదమే కారణంగా పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది.

రూ. 200 కోట్ల బినామీ ఆస్తుల వల్లే రియల్టర్ హత్య!
X

దిశ, సిటీ క్రైం : మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలో జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి వివాదమే కారణంగా పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. 1996లో హైదరాబాద్‌లో గుడుంబా డాన్‌గా పేరొందిన ధూల్‌పేట్‌కు చెందిన సుధేశ్ సింగ్ కారు డ్రైవర్‌గా చేరిన వెంకటరత్నం.. 2000 సంవత్సరంలో పోలీసులకు అప్రూవర్‌గా మారి సుధేశ్ సింగ్ ఎన్‌కౌంటర్‌కు కారకుడయ్యాడని ప్రచారంలో ఉంది. అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా అప్పటి నుంచి సుధేశ్ సింగ్ కుటుంబం నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే సుధేశ్ సింగ్ కుమారుడు మరో నలుగురితో కలిసి వెంకటరత్నంను సోమవారం ఉదయం జవహర్‌నగర్ సాకేత్ కాలనీలో కత్తులతో నరకి, తుపాకీ‌తో కాల్చి హత్య చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు.

తరచూ ప్రాంతాలు మారుతూ..

గుడుంబా దందా చేస్తున్న సమయంలో సుధేశ్ సింగ్ తన కారు డ్రైవర్‌ వెంకటరత్నంను నమ్మి అత్యంత ఖరీదైన ప్రాంతాలైన నానక్‌రాంగూడ, ఖాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఆస్తులను అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం వాటి విలువ రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఏపీకి వెంకటరత్నం 2000 సంవత్సరంలో అప్రూవర్‌గా మారి పరారీలో ఉన్న సుధేశ్ సింగ్‌కు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వడంతో అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత వెంకటరత్నం ఒకేచోట ఉండకుండా తరచూ ప్రాంతాలు మారుతూ తిరుగుతున్నాడు. ఆయా ఆస్తులను చూపి రియల్టర్‌గా మారి పలువురి నుంచి డబ్బు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగినట్టు సమాచారం.

బ్యాంక్ ఆక్షన్‌తో గొడవ షురూ..

ఇటీవల సుధేశ్ సింగ్‌కు సంబంధించిన ఓ ఆస్తికి సంబంధించిన వ్యవహారం బ్యాంక్ ఆక్షన్‌కు వెళ్లింది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు వెంకటరత్నం పేరు మీద ఉండడంతో సుధేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ దానిపై ఆరా తీశాడు. ఈ క్రమంలోనే వెంకటరత్నం పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి తన తండ్రి ఎన్‌కౌంటర్‌కు కారణమయ్యాడని తెలుసుకున్నాడు. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నీ అతడి పేరు మీదే ఉన్నాయని గుర్తించి టార్గెట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే చందన్ సింగ్ వెంకటరత్నంను కలిసి ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై మాట్లాడారు. తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నింటినీ తిరిగి ఇవ్వాలని చందన్ సింగ్ అడిగాడు. అయితే వెంకటరత్నం గొడవకు దిగి ‘నీ తండ్రిని ఎన్‌కౌంటర్ చేసినట్లే నిన్ను కూడా చేయిస్తా’ అంటూ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది.

స్విగ్గీ, జొమాటో బాయ్స్‌గా రెక్కీ..

చందన్ సింగ్ మరో నలుగురితో వెంకటరత్నంను హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. ఆచూకీ కోసం గాలించాడు. ఈ క్రమంలోనే గత ఏడు నెలల కిందటే వెంకటరత్నం సాకేత్ కాలనీకి మకాం మార్చాడని చందన్ సింగ్ గ్యాంగ్ తెలుసుకుంది. వెంకటరత్నం ఒంటిరిగా బయటికి వెళ్లడని, ముగ్గురు లేదా నలుగురు ఉంటేనే వెళ్తాడని, అది కూడా రాత్రి సమయంలోనే కారు ఇంటి ముందుకు తెచ్చి పెట్టగానే క్షణాల్లో ఎక్కేస్తాడని గమనించారు. 15 రోజుల నుంచి చందన్ సింగ్ గ్యాంగ్ స్విగ్గీ, జొమాటో బాయ్స్‌ వేషధారణలో ఉదయం నుంచి రాత్రి వరకు రెక్కీ చేశారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలోనే వెంకటరత్నం ఒంటరిగా పిల్లలను స్కూల్‌లో వదిలేసి వస్తాడని తెలుసుకున్నారు. అదే సమయానికి టార్గెట్ చేసిన ఐదుగురు వ్యక్తులు వెంకటరత్నంను హత్య చేశారు. అనంతరం చందన్ సింగ్, అతడి అనుచురులు నేరుగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని షాయినాత్ గంజ్ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయారని సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. రాచకొండ పోలీసుల సమాచారం ప్రకారం హత్యకు పాల్పడిన నిందితులు పరారీలోనే ఉన్నారని తెలిసింది. ఉన్నతాధికారులు తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో బిజీగా ఉండడంతో నిందితుల అరెస్టు, ఇతర వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.

Next Story