జోరుగా ఆన్‌లైన్ షాపింగ్ నకిలీ ఆఫర్లు.. తెలంగాణ సైబర్ బ్యూరో కీలక హెచ్చరిక

by Kema Shiva Kumar |

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ డిస్కౌంట్లు, ఫేక్ సేల్ ఆఫర్ల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

జోరుగా ఆన్‌లైన్ షాపింగ్ నకిలీ ఆఫర్లు.. తెలంగాణ సైబర్ బ్యూరో కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లు, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లను చూసి మురిసిపోతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులతో సైబర్ ముఠాలు పొంచి ఉన్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు, క్లియరెన్స్ సేల్స్, ప్రత్యేక ఆన్‌లైన్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నట్లుగా బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఓ ప్రకటను విడుదల చేశారు

నేరగాళ్ల కొత్త జిత్తులు..

సైబర్ నేరగాళ్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తూ.. వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్, ఇమెయిల్ ద్వారా నకిలీ లింకులు పంపుతున్నారు. బ్రాండెడ్ వస్తువులను అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నట్లు నమ్మించి, లిమిటెడ్ టైమ్ సేల్ ఆఫర్, స్టాక్ క్లియరెన్స్ అంటూ ముందస్తు చెల్లింపుల కోసం యూపీఐ, క్యూఆర్ కోడ్, నేరుగా బ్యాంక్ ఖాతాల వివరాలను కోరుతున్నారు. అదేవిధంగా ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్ల ద్వారా కూడా బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

మోసాలను గుర్తించండి ఇలా..

అయితే, సైబర్ మోసాలను గమనించేందుకు పోలీసులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ వస్తువులు ఊహించని తక్కువ ధరకు లభిస్తుండటం, ఆన్ఆథరైజ్డ్, అధికారిక సంస్థల పేర్లను పోలిన నకిలీ వెబ్సైట్లను నమ్మకూడదని అన్నారు. మరికొద్ది నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది. కొన్ని వస్తువులు మాత్రమే మిగిలాయి అంటూ ఒత్తిడి చేయడం వంటి ఆఫర్లకు దూరంగా ఉండలన్నారు. సదరు వెబ్‌సైట్‌లో ప్రాడక్ట్ కొనగోలు చేసిన కస్టమర్స్ రేటింగ్స్, రివ్యూలు కనిపించకపోవడాన్ని గమనించాలన్నారు. అధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి చెక్ అవుట్ లేకుండా ముందస్తు పేమెంట్ చేయమని చెప్పడాన్ని మోసంగా గుర్తించాలని తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు.

1930కు కాల్ చేయండి..

ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే తక్షణమే మీ బ్యాంకును సంప్రదించి లావాదేవీని నివేదించడంతో పాటు, మోసానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు, పేమెంట్ రిసిప్ట్‌లు, ఆర్డర్ వివరాలు, రికార్డింగ్ సంభాషణలను భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు.

Next Story