ఫైనాన్స్ డబ్బుల కోసం హత్య.. ఇద్దరు రైల్వే ఉద్యోగులు అరెస్ట్..

by Bhanu |

రైల్వేలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కలిసి ఓ ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేసిన ఘటన కాజీపేటలో వెలుగు చూసింది.

ఫైనాన్స్ డబ్బుల కోసం హత్య.. ఇద్దరు రైల్వే ఉద్యోగులు అరెస్ట్..
X

దిశ, హనుమకొండ : రైల్వేలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కలిసి ఓ ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేసిన ఘటన కాజీపేటలో వెలుగు చూసింది. హత్యకు గల అసలు కారణం అప్పు తీర్చలేకపోవడం. కేసు విచారణలో నిందితులపై మునుపటి క్రిమినల్ చరిత్ర బయటపడింది. కాజీపేట పోలీసులు ఈ హత్యకేసును ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు.. ఏ1 గడ్డం ప్రవీణ్ కుమార్ (34), టెక్నీషియన్ గ్రేడ్-3, ఎలక్ట్రిక్ లోకో షెడ్, కాజీపేట, ఏ2 గుండ రజని (34), రైల్వే ఉద్యోగి, గ్రేడ్-1 టెక్నీషియన్, కాజీపేట ఇద్దరూ ఒకే శాఖలో పని చేస్తూ 2013 నుండి పరిచయమై శారీరక సంబంధం ఏర్పరుచుకున్నారు.

ప్రవీణ్ కుమార్ భార్య అదనపు కట్న వేధింపులు భరించలేక 2018లో ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో గడ్డం ప్రవీణ్, రజనిలపై డౌరీ డెత్ కేసు నమోదు అయింది. మునుపటి చరిత్ర.. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ కలసి పెద్దపల్లి జిల్లాలో వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో మరోసారి అరెస్ట్ అయ్యారు. అలాగే మట్టేవాడ, పాలకుర్తి, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగనోట్లు చలామణీ చేసిన కేసుల్లోనూ నిందితులపై కేసులు ఉన్నాయి.

ప్రస్తుత హత్యా ఘటన వివరాలు..

డీజిల్ లోకో షెడ్‌ పరిధిలో పనిచేసే త్రిపురాది నవీన్ కుమార్ అనే ఫైనాన్స్ వ్యాపారి నుంచి ప్రవీణ్ కుమార్ రూ. 30,000 అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో నవీన్ ఒత్తిడి తెస్తుండగా, అతన్ని హత్య చేసి డబ్బులు, బంగారం దోచుకోవాలని ప్రణాళిక రూపొందించారు.

జూన్ 27వ తేదీ మధ్యాహ్నం నవీన్‌ను తన క్వార్టర్స్‌కు రమ్మని పిలిచిన ప్రవీణ్, అక్కడే కత్తితో పొడిచాడు. తర్వాత రజని అతని కాళ్లు చున్నితో కట్టి పట్టుకోగా, ప్రవీణ్ బండరాయితో తలపై బలంగా కొట్టాడు. నవీన్ మరణించిన తర్వాత అతని ఒంటి మీద ఉన్న సుమారు 15 తులాల బంగారాన్ని, సెల్ ఫోన్‌ను దోచుకున్నారు.

పోలీసుల అదుపులోకి నిందితులు..

జూలై 1న ఉదయం కడిపికొండ బ్రిడ్జి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న కాజీపేట పోలీసులు ప్రవీణ్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా హత్య విషయాన్ని ఒప్పుకున్నాడు. పంచుల సమక్షంలో నిందితుడు చూపించిన ప్రదేశాల్లో హత్యకు ఉపయోగించిన కత్తి, బండరాయి, మృతుని స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రజని నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు.. మొత్తం దాదాపు 165 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గడ్డం ప్రవీణ్, గుండ రజిని ల మీద గతంలో ఐదు కేసులు, ఇప్పుడు ఒక కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నందున సీపీ ఆదేశానుసారం వారిద్దరిపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నట్లు కాజీపేట పోలీసులు తెలిపారు. ఈ కేసును కాజీపేట ఏసీపీ పర్యవేక్షణలో ఎస్ఐ వి. నవీన్ కుమార్, ఎస్‌హెచ్‌ఓ వై. సుధాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వర్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్, విష్ణులు పరిశోధించి ఛేదించారు. పోలీసు శాఖ వారిని అభినందించింది.

Next Story