Ekadashi Murders: పిల్లల హత్యకేసులో కొత్తకోణం.. క్షుద్రపూజలకోసం చంపిందా?

by Naga Rani Yarlagadda |

హర్యానాలో ఇటీవల వెలుగుచూసిన పిల్లల హత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది.

Ekadashi Murders: పిల్లల హత్యకేసులో కొత్తకోణం.. క్షుద్రపూజలకోసం చంపిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానాలో ఇటీవల వెలుగుచూసిన పిల్లల హత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నిందితురాలు పూనమ్ ను సైకోపతిక్ సీరియల్ కిల్లర్ గా అభివర్ణిస్తున్న క్రమంలో.. పిల్లల హత్యలకు, క్షుద్రపూజలకు సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పూనమ్ రెండేళ్లలో నలుగురు పిల్లల్ని నీటిలో ముంచి చంపగా.. వారు చనిపోయిన రోజులు ఏకాదశి అని బంధువులు ఆరోపించారు. కానీ.. పోలీసులు మాత్రం పూనమ్ తనకంటే ఎవరైనా అందంగా ఉంటే సహించలేదని, ఆమెకు అబ్సెసివ్, మానసిక రుగ్మత ఉన్నాయని వాదిస్తున్నారు.

బాధితుల్లో ఒకరి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబంలో ముగ్గురి హత్యలు ఏకాదశి రోజున జరిగినట్లు తెలిపారు. అందులోనూ అన్నీ ఒకేరకంగా జరిగాయని, ఇదేదో కుట్రపూరిత కార్యకలాపాలను సూచిస్తోందని ఆరోపిచారు. దీనివెనుక క్షుద్రకోణం కూడా ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో గ్రామంలో పూనమ్ తన ఆరేళ్ల మేనకోడలిని నీటిలో ముంచి చంపిందన్న అనుమానం ఉందని, కానీ ఆమె నాటకీయంగా ఏడవడంతో దీనిపై పోలీసులకు చెప్పలేదని ఒకరు తెలిపారు.

2023 నుంచి 2025 మధ్యకాలంలో పూనమ్ (32) నలుగురు పిల్లల్ని నీటిలో ముంచి చంపగా.. వారిలో ఆమె మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. పిల్లల హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే పూనమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పానిపట్ ఎస్పీ భూపేందర్ సింగ్ తెలిపారు. తమ కుటుంబంలో ఏ బిడ్డ కూడా తనకంటే అందంగా ఉండకూడదన్న అసూయతోనే పూనమ్ ఇలా చేసినట్లుగా తెలిపారు. ప్రతీ హత్య తర్వాత ఆమె దుస్తులు తడిగా ఉండటాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అనుకోకుండా నీళ్లు పడ్డాయని, ఇంకా ఏవేవో సాకులు చెప్పేదన్నారు. 2023 తర్వాత ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ కావడంతో ఏడాదిన్నర పాటు హత్యలకు బ్రేక్ పడినట్లుగా తెలిసిందన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

2023లో పూనమ్ వదిన కూతురైన 9 ఏళ్ల బాలికను నీటిలో ముంచి చంపింది. దానిని కప్పిపుచ్చేందుకు తన సొంత కొడుకును (3) కూడా అలాగే చంపేసింది.

2025 ఆగస్టులో సేవా గ్రామంలో బంధువుల కుమార్తె అయిన జియాను నీటితొట్టెలో ముంచి చంపింది.

2025 డిసెంబరులో నౌలఖా గ్రామంలో పెళ్లికి వెళ్లిన పూనమ్.. బంధువుల అమ్మాయి అయిన ఆరేళ్ల విధి ని కూడా నీటిలో ముంచి చంపింది. ఈ హత్యకేసులో సీసీటీవీ ఫుటేజీ బయటపడంతో పూనమ్ అసలు రంగు బయటపడింది. గతంలో జరిగిన మూడు హత్యలు కూడా తానే చేసినట్లు పూనమ్ అంగీకరించింది. ప్రస్తుతం ఆమె సివా జైలులో ఉంది.

Next Story