- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండానే పోస్టుమార్టం..!
ఎల్కతుర్తి–ఇందిరానగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, భీమదేవరపల్లి: ఎల్కతుర్తి–ఇందిరానగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడికి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే పోస్టుమార్టం నిర్వహించారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, స్థానిక మహిళలు ముల్కనూరు–కొత్తకొండ ప్రధాన రహదారిలో ముత్తారం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ప్రధాన రోడ్ పై బైఠాయించి ధర్నా చేపట్టారు. మృతుడికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదానికి కారణమైన గుగులోతు శ్రీనివాస్‌పై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలాగే పోగుల అరుణ్‌కుమార్, పోగుల అజిత్‌కుమార్‌ల పాత్రపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మృతుడి కుటుంబానికి తొలుత రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, అనంతరం రూ.1.50 లక్షలకు కుదించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పుడు అంత్యక్రియల ఖర్చుల పేరుతో కేవలం రూ.20 వేలే ఇస్తామని చెబుతున్నారని, ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు మరో రూ.10 వేలతో సరిపెట్టాలని మాట్లాడుతున్నారని స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాటలు మారుస్తూ బాధిత కుటుంబాన్ని మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ప్రకటించిన పరిహారాన్ని పూర్తిగా అందజేయడంతో పాటు, ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మహిళలు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్థానికులు స్పష్టం చేశారు.






