- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజన సిబ్బందికి ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ
హుజూరాబాద్‌లో మధ్యాహ్న భోజన సిబ్బందికి ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఉండదని డీఈఓ

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సహాయకులు, స్కావెంజర్లకు కీర్తిశేషులు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం చీరలు పంపిణీ చేశారు. స్థానిక శాస్త్ర పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) నరెడ్ల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 120 మంది సిబ్బందికి చీరలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ విద్యారంగానికి చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు, విద్యా సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
మధ్యాహ్న భోజన సిబ్బంది వంటశాలలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ జగదీశ్వర్ 2011 నుంచి విద్యార్థుల కోసం ప్రతిభా పోటీలు, పరీక్షా ప్యాడ్లు, ప్లేట్ల పంపిణీతో పాటు అనాథలు, వృద్ధులు, కూలీలకు సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ, గుర్తింపు కోసం కాకుండా సమాజానికి, విద్యార్థులకు తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కర్ర అశోక్ రెడ్డి, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు దేవారం మేరీ శోభారాణి, అనురాధ, శ్రీభవాని, శాస్త్ర పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మారబోయిన వేణుమాధవ్, ప్రిన్సిపాల్ ముంజల సంగీత, ఉపాధ్యాయులు, సీఆర్పీలు రవిబాబు, రమేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.






