- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fact Check: పూజారిపై దాడి ఘటనలో మతపరమైన కోణం లేదు.. నిందితుడి అక్రమ నిర్మాణాలపై బుల్డోజ్
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అధోని గ్రామంలో 74 ఏళ్ల వృద్ధ ఆలయ పూజారిపై జరిగిన అమానుష దాడి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అధోని గ్రామంలో 74 ఏళ్ల వృద్ధ ఆలయ పూజారిపై జరిగిన అమానుష దాడి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఈ దాడిలో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి అక్రమ నిర్మాణాలను తాజాగా రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.
అసలేం జరిగిందంటే..?
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. జూలై 9న అధోని గ్రామంలోని శివాలయంలో పూజారిగా ఉన్న యోగిరాజ్ గిరి (74)పై పంకజ్ సైనీ అనే వ్యక్తి కర్రతో దారుణంగా దాడి చేశాడు. అనంతరం పూజారి మెడకు గుడ్డ కట్టి రోడ్డుపై అత్యంత కిరాతకంగా ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో పూజారి కాలు విరిగిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారి తీవ్ర కలకలం రేపాయి.
అది ఫేక్ న్యూస్.. పోలీసుల క్లారిటీ
శివాలయం వల్ల సమీపంలో ఉన్న దర్గాకు జనం రావడం లేదన్న అక్కసుతో దర్గా కేర్‌టేకర్ అయిన ‘గఫార్ అలీ’ అనే వ్యక్తి పూజారిపై దాడికి పాల్పడ్డాడంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై తానేసర్ సదర్ ఎస్‌హెచ్‌ఓ రణ్‌ధీర్ సింగ్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. బాధితుడు, దాడికి పాల్పడిన నిందితుడు ఇద్దరూ హిందూ మతానికి చెందినవారేనని స్పష్టం చేశారు. నిందితుడి పేరు గఫార్ అలీ కాదని, అతని పేరు ‘పంకజ్ సైనీ’ అని వెల్లడించారు. ఈ దాడి ఘటనలో మతపరమైన విద్వేషాలు లేవని, నిందితుడు పంకజ్‌తో పాటు అతని భార్యను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి ఆక్రమణల కూల్చివేత
ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సమీపంలోని దర్గాకు కేర్‌టేకర్‌గా ఉంటున్న నిందితుడు పంకజ్ సైనీ.. దర్గా ముందు సుమారు 100 అడుగుల మేర స్థలాన్ని ఆక్రమించాడు. దీంతో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDPO) అమిత్ కుమార్ నేతృత్వంలోని బృందం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ ఆక్రమణలతో పాటు, పంకజ్ ఇంటికి చెందిన ఒక గోడను సోమవారం కూల్చివేసింది.






