కన్నేపల్లి పంపులను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలి

by Ratna Kumari |

కన్నేపల్లి పంపులను వెంటనే ప్రారంభించి ప్రాజెక్టులు, చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.

కన్నేపల్లి పంపులను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలి
X

దిశ, గన్నేరువరం : కన్నేపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లను వెంటనే ప్రారంభించి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలను నింపాలని మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం గంప వెంకన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మండలంలోని డి-8 ఉపకాలవను పరిశీలించారు. నీరు లేక ఎండిపోయిన కాలువలో క్రికెట్ ఆడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ఇప్ప నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కాలేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నప్పటికీ మోటార్లు ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జూలై నెల వచ్చినా నాట్లు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మొలకెత్తిన పంటలను కాపాడేందుకు వెంటనే కన్నేపల్లి పంపులను ప్రారంభించి ప్రాజెక్టులకు నీటిని మళ్లించాలని, వరద కాలువల ద్వారా చెరువులను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమం తరహాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గూడూరి సురేష్, జక్కన్నపల్లి సత్తయ్య, మీసాల ప్రభాకర్, గొల్లపల్లి రవి, నేలపట్ల శంకర్ గౌడ్, ఆటీకం శ్రీనివాస్, బూర శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాస్‌తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story