ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమోనన్న భయం.. 3 రోజుల శిశువును అడవిలో వదిలేసిన తల్లిదండ్రులు

by Prasad Jukanti |   (  Updated:2025-10-02 09:22:16  IST  )

అప్పుడే పుట్టిన తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి దండ్రులు తమ బిడ్డ పట్ల అంత్యంత దారుణంగా వ్యవహరించారు.

ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమోనన్న భయం.. 3 రోజుల శిశువును అడవిలో వదిలేసిన తల్లిదండ్రులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అప్పుడే పుట్టిన తమ బిడ్డను (Newborn baby) కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు తమ బిడ్డ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏ మాత్రం కనికరం లేకుండా తమకు అప్పుడే పుట్టిన బిడ్డను కారడవిలో వదిలేసి వచ్చారు. అత్యంత ఘోరమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) చింద్వారాలోని అటవీ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే...ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బబ్లు దండోలియా ఆయన భార్య రాజకుమారి దండోలియాకు ఇప్పటికే ముగ్గురు సంతానం. సెప్టెంబర్ 23న రాజకుమారి ఇంట్లోనే నాలుగో సంతానంగా మగబిడ్డను ప్రసవించింది. అయితే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న తమకు నాలుగో సంతానం కూడా ఉందని తెలిస్తే తన ఉద్యోగం పోతుందని భయపడిన బబ్లూ.. గర్భం దాల్చిన విషయం రహస్యంగా ఉంచాలని, బిడ్డ పుట్టిన వెంటనే చంపేయాలని లేదంటే తన ఉద్యోగం పోతుందని తన భార్యను ఒప్పించాడు. దాంతో గర్భం దాల్చిన విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు. తాజాగా ఆమె బిడ్డను ప్రసవించడంతో బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే నవజాత శిశువును అటవికి తీసుకువెళ్లి ఓ బండరాయి కింద కప్పిపెట్టి వచ్చేశారు.

మూడు రోజుల తర్వాత అటువైపుగా వెళ్లిన స్థానికులకు చిన్నారి ఏడ్పు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా బండరాయి కింద కొట్టుమిట్టాడుతున్న పసికందు కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోీలసులు ఆ శిశువును చింద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ బిడ్డకు వైద్యం అందిస్తున్నారు. చిన్నారి ఇంకా బతికి ఉండటం అద్భుతం అని వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో శిశువు తల్లిందండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story