ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరి మృతి..

by Taduka Kalyani |

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరి మృతి..
X

దిశ, చిన్నకోడూరు: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చిన్నకోడూరు మండలం అనంతసాగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరుకు చెందిన షేక్ మక్బుల్ భాషా (61) తాడిపత్రి నుంచి నాపరాయి బండల లోడ్‌తో లారీలో కాగజ్‌నగర్‌కు బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర రావడంతో డ్రైవింగ్‌ను రఫీకి అప్పగించాడు. అనంతసాగర్ సమీపానికి చేరుకున్న తర్వాత రఫీ అతివేగంగా, అజాగ్రత్తగా లారీ నడపడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రతకు లారీలో ప్రయాణిస్తున్న నలుగురు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు షేక్ మక్బుల్ భాషా మృతి చెందినట్లు నిర్ధారించారు. రఫీ, గొల్ల వెంకటేశ్వర్లు, లారీ యజమాని షేక్ షేకావలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Next Story