గోవా ముఠాలతో కలిసి డ్రగ్స్ దందా.. నైజీరియన్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

by Bhanu |

ఖరీదైన ఫ్లాట్ లలో నివాసం ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న ఓ నైజీరియన్ తో పాటు మరో ఇద్దర్నీ టీజీ నాబ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా సోమవారంఅరెస్ట్ చేశారు.

గోవా ముఠాలతో కలిసి డ్రగ్స్ దందా.. నైజీరియన్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్
X

దిశ, సిటీక్రైం : ఖరీదైన ఫ్లాట్ లలో నివాసం ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న ఓ నైజీరియన్ తో పాటు మరో ఇద్దర్నీ టీజీ నాబ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా సోమవారంఅరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నుంచి 30 లక్షలు విలువ చేసే కొకైన్, ఎక్సటసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గోవా కు చెందిన మాక్స్ డ్రగ్స్ ముఠా నుంచి వీరు కొకైన్ , ఇతర మత్తు పదార్ధాలను తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నారని టీజీ నాబ్ , నార్సింగి పోలీసులు గుర్తించారు. టీజీనాబ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మణికొండ అల్కాపురి ప్రాంతంలోని అనుహార్ బెల్స్ అపార్ట్ మెంట్ లోని నాల్గవ అంతస్తులో నైజీరియా దేశానికి చెందిన విస్డమ్ ఓయేకా, గోపిశెట్టి రాజేష్, వీరా రాజులు డ్రగ్స్ సరఫరాకు ప్లాన్ చేస్తున్నారని టీజీ నాబ్ అధికారులకు సమాచారం అందింది. నార్సింగి పోలీసులతో కలిసి టీజీ నాబ్ అధికారులు ఫ్లాట్ లో సోదాలు జరిపి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర 30 లక్షలు విలువ చేసే 107 గ్రాముల కొకైన్, 25 ఎక్సటసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు గోవాలో ఉంటున్న నైజీరియాకు చెందిన మాక్స, హనుమంత్ బాబుసో దివాకర్ ముఠాలతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

స్టూడెంట్ వీసా మీద వచ్చి..

విస్డమ్ ఓయేకా 2022లో స్టూడెంట్ వీసా మీద సూడాన్ దేశానికి చెందిన పాసుపోర్టు తో చుక్వు విక్టర్ పేరుతో ఇండియాకు వచ్చాడు. గోవాలో మాక్స్ డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి డ్రగ్స్ దందాను ప్రారంభించాడు. ఈ సందర్భంలో మాక్స్ 2023 సంవత్సరంలో విస్డమ్ కు నైజీరియా పాసుపోర్టును ఇప్పించాడు. 2024 సెప్టెంబరు లో నైజీరియా పాసుపోర్టు మీద తన దేశానికి వెళ్ళిపోయి అక్కడ సూడాన్ దేశానికి చెందిన పాసుపోర్టును ధ్వంసం చేశాడు. తిరిగి డిసెంబరు నెలలో నైజీరియా పాసుపోర్టు మీద వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈ సమయంలో మణికొండ కు చెందిన గోపిశెట్టి రాజేష్, వీరా రాజులు విస్డమ్ వద్ద డ్రగ్స్ ను కొనుగొలు చేసేవారు. ఇలా అతనితో స్నేహం పెరిగి వీరు కూడా తక్కువ ధరలో డ్రగ్స్ ను మాక్స్ ముఠా నుంచి తీసుకుని హైదరాబాద్ లో సంపన్నులకు అధిక ధరలో విక్రయిస్తున్నారని విచారణలో తెలిసింది.

మే నెలలో మొయినాబాద్ లో రేవ్ పార్టీ..

ఏపీకి చెందిన ఫణి రాజ్ మే 29న మొయినాబాద్ అజీజ్ నగర్ ప్రాంతంలోని తన ఫాం హౌజ్ లో రేవ్ పార్టీ ని నిర్వహించాడు. ఈ పార్టీ కోసం గోపిశెట్టీ రాజేష్ కొకైన్ ను ఫణి రాజ్ కు విక్రయించాడు. మరోసారి రాజేష్ ఏపీ మంగళగిరి కి వెళ్ళి కొకైన్ ను ఫణిరాజ్ కు డెలివరి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ముగ్గురు నుంచి సంపన్న కుటుంబాలకు చెందిన పవిత్ర రెడ్డి, సతీష్, సదా శివ, సుధీర్, భానులకు కొకైన ఎక్సటసీ పిల్స్ ను సరఫరా చేసినట్లు పోలీసులు విచారణలో ఆధారాలు సేకరించారు. రాజేష్, వీరా రాజులు గతంలో డ్రగ్స్ ను సరఫరా చేస్తు రాయదుర్గం పోలీసులకు చిక్కినా వారు జైలు నుంచి విడుదలయ్యి తిరిగి దందాను కొనసాగిస్తున్నట్లు తేలింది. డ్రగ్స్ సంబంధించి సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబరు-1908, వాట్సాప్ నెంబరు -87126671111 కు అందించాలని టీజీ నాబ్ అధికారులు కోరుతున్నారు.

Next Story