- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం ఉగ్రదాడి కేసులో NIA ఛార్జ్‌షీట్.. పాకిస్తాన్ అబద్ధాలు బట్టబయలు
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ సమర్పించిన ఛార్జ్‌షీట్‌తో పాకిస్తాన్ కుట్ర పూర్తిగా బయటపడింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam)లో జరిగిన టెర్రరిస్టుల మారణహోమం వెనుక పాకిస్తాన్ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పక్కా ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఈ కేసుపై ఎన్‌ఐఏ కోర్టులో సమర్పించిన సుదీర్ఘ ఛార్జ్‌షీట్‌లో ఉగ్రవాదులు, వారి పాక్ హ్యాండ్లర్ల మధ్య ఉన్న టెక్నికల్, నెట్‌వర్క్ సంబంధాలను బట్టబయలు చేస్తూ దాయాది అబద్ధాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ దాడి అంతా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) రచించిన వ్యూహం ప్రకారం జరిగిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.
లాహోర్, కరాచీల్లో కొన్న మొబైల్స్..
అయితే, ‘ఆపరేషన్ మహాదేవ్’ (Operation Mahadev)లో భద్రతా దళాల చేతిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరి వద్ద దొరికిన మొబైల్ ఫోన్లపై ఎన్‌ఐఏ (NIA) ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫోన్ల తయారీ సంస్థ జియోమీ (Xiaomi) లొకేషన్, సప్లై చైన్ రికార్డులను పరిశీలించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో ఓ ఫోన్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ ఇండస్ట్రియల్ ఏరియాలో, మరొకటి కరాచీలోని షహ్రా-ఎ-ఫైసల్‌లో అమ్ముడైనట్లుగా జియోమీ ఇండియా ధృవీకరించింది. దాడికి సంబంధించిన లాజిస్టికల్ సాయం, బార్డర్ అవతలి నుంచే అందిందనడానికి ఇది బలమైన సాక్ష్యంగా నిలిచింది.
ఐపీ అడ్రస్ దొరికిందిలా..
పహల్గాం టెర్రక్ అటాక్ జరిగిన వెంటనే ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ‘కాశ్మీర్ ఫైట్’ (The Kashmir Fight) అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే పై నుంచి వచ్చిన ఒత్తిడి పెరగడంతో తమ అకౌంట్ హ్యాక్ అయిందని, తమకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ, ఎన్‌ఐఏ టెక్నికల్ టీమ్ ఆ టెలిగ్రామ్ ఛానల్ ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేయగా, అవి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బట్టగ్రామ్, రావల్పిండి నుంచి ఆపరేట్ అయినట్లుగా విచారణలో తేలింది.
A1గా టాప్ కమాండర్ సైఫుల్లా..
ఈ మొత్తం దాడికి లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా (Saifullah) అలియాస్ సాజిద్ జట్ (Sajid Jat)ను ఏ1 నిందితుడిగా ఎన్‌ఐఏ చేర్చింది. పాక్‌లోని కసూర్ ప్రాంతంలో జన్మించిన సాజిద్ జట్, ఓ ఎన్‌కౌంటర్‌లో కాలు కోల్పోయి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ కాలుతోనే తిరుగుతున్నాడు. అతడు లాహోర్, కసూర్ సేఫ్‌హౌస్‌ల నుంచి కూర్చుని దాడి జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులకు లైవ్ కో ఆర్డినేట్స్ అందిస్తూ గైడ్ చేసినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సాజిద్ జట్ 2005లో ఇతడు కాశ్మీర్‌లోకి చొరబడి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి పాక్ వెళ్లగా అతడి కొడుకు కాశ్మీర్‌లోనే ఉన్నాడు. తాజాగా ఎన్‌ఐఏ అతడి కొడుకు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసింది. ప్రస్తుతం సాజిద్ జట్‌పై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది.






