- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడలో విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు సూసైడ్
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. భర్త, అత్తింటి వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కాళ్ల పారాణి ఆరకముందే.. భర్త, అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదకర ఘటన వెలుగుచూసింది. పట్టుమని మూడు వారాలు కూడా గడవక ముందే ఒక నవవధువు జీవితం నరకప్రాయమై, చివరికి బలవన్మరణానికి దారితీసింది. భర్త వికృత చేష్టలు, తాగుడు వ్యసనం, అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక సత్యంశెట్టి వెంకటలక్ష్మి (22) అనే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది.
తొలిరాత్రే అసలు రంగు బయటపెట్టిన భర్త
బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి, గాది కోటేశ్వరరావు అనే యువకుడికి గత నెల ఏప్రిల్ 25న వైభవంగా వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన మొదటి రోజే వెంకటలక్ష్మికి కోలుకోలేని షాక్ తగిలింది. శోభనం రోజే భర్త కోటేశ్వరరావు తనకు ఇతర అమ్మాయిలతో ఉన్న అక్రమ సంబంధాల (అఫైర్స్) గురించి భార్యకు చెప్పి పైశాచిక ఆనందం పొందాడు. కోటేశ్వరరావు అంతటితో ఆగకుండా, తను ఇతర మహిళలతో అసభ్యంగా ఉన్న ఫొటోలను, వీడియోలను స్వయంగా భార్య వెంకటలక్ష్మి వాట్సప్ నంబర్‌కే పంపిస్తూ తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేశాడు. మరోవైపు, పెళ్లయిన మొదటి రోజు నుంచే అత్తింటివారు కూడా తోడై వెంకటలక్ష్మిని మానసికంగా వేధించేవారని భరించలేక ఆమె తన కుటుంబ సభ్యుల వద్ద వాపోయింది. భర్త తాగుడు, పరస్త్రీలతో ఉన్న సంబంధాలను చూసి రోజురోజుకూ కుంగిపోయిన వెంకటలక్ష్మి, ఈ నరకం నుంచి విముక్తి పొందలేక చివరికి తనువు చాలించింది.
పెళ్లికి ముందే రూ. 2 లక్షల సెటిల్‌మెంట్
కోటేశ్వరరావు చరిత్ర ఎంత దారుణమైనదో చెప్పడానికి మరో నిజం బయటపడింది. వీరికి పెళ్లి జరగడానికి కేవలం రెండు రోజుల ముందే.. కోటేశ్వరరావు వేరే ఒక యువతితో ఉన్న గొడవను ఏకంగా రూ. 2 లక్షలు ఇచ్చి పంచాయితీ చేసి సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. ఈ మోసాన్ని దాచిపెట్టి వెంకటలక్ష్మి మెడలో తాళి కట్టాడు.
కుటుంబ సభ్యుల ఆక్రందన.. పోలీసుల దర్యాప్తు
భర్త కోటేశ్వరరావు అరాచకాలు, అత్తింటివారి నిరంతర వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వెంకటలక్ష్మి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను బలితీసుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కోటేశ్వరరావు వాట్సప్ చాటింగ్‌లు, బాధితుల ఆరోపణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.






