- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు.. రోజుకో ట్విస్ట్.. కొలిక్కి వచ్చేదెప్పుడు?
అతని మూడో భార్యగా ఉన్న టీనా.. గతంలో అతని వద్ద పనిచేసిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో ఘజియాబాద్ లో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశమంతటా సంచలనం రేపిన విషయం తెలిసిందే. నేటి యూత్, టీనేజర్లు ఫోన్లకు, ఆన్లైన్ గేమ్లకు అడిక్ట్ అవుతుండటంతో.. వారి మరణాలకు కూడా ఆ అడిక్షనే కారణమని అందరూ భావించారు. కానీ.. పోలీసుల దర్యాప్తులో రోజుకో షాకింగ్ విషయం బయటికొస్తుంది. వారి తండ్రి చేతన్ కుమార్ కు గతంలో లివిన్ పార్ట్నర్ సూసైడ్ కేసులోనూ నిందితుడిగా ఉన్న రికార్డులు బయటపడ్డాయి. అంతేకాదు.. అతనికి ముగ్గురు భార్యలుండగా.. చనిపోయిన కూతుళ్లు ఇద్దరు భార్యలకు పుట్టినవారు. అతని వివాహ సంబంధాలు, ఆ ఇంట్లో పిల్లల దీనస్థితిపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అతని మూడో భార్యకు సంబంధించి కీలక విషయం బయటికొచ్చింది.
ఫస్ట్ మరదలు.. తర్వాత భార్యగా పరిచయం
అతని మూడో భార్యగా ఉన్న టీనా.. గతంలో అతని వద్ద పనిచేసిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అసలు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపేశారా? తేలక తలలు పట్టుకుంటున్నారు. చేతన్ కుమార్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2018లో క్రెడిట్ కార్డ్ సేవల విభాగంలో పనిచేస్తున్నప్పుడు టీనా అనే యువతిని పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ దగ్గరై పెళ్లి చేసుకున్నారని, ఆమె తన మూడవ భార్య అని సమాచారం. టీనా వయసు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే, గతంలో టీనా తన మరదలు అని చెప్పిన చేతన్, ఇప్పుడు భార్య అని మాట మార్చడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.
తనకు 2010లో సుజాతతో, 2013లో హీనాతో వివాహం జరిగిందని ఒప్పుకున్నాడు చేతన్. అయితే మొదటి భార్యకు పిల్లలు కలగలేదనే కారణంతోనే తాను మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు చెప్తున్నాడు. కానీ.. సుజాతకు పుట్టిన పెద్ద కుమార్తె వయసు 16 ఏళ్లు కావడంతో అతని మాటలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యలిద్దరూ నిరక్షరాస్యులు కావడంతో మ్యారేజ్ సర్టిఫికేట్స్ సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది.
మూడు గదుల ఇల్లు.. కానీ అందరూ ఒకే గదిలో..
ఆ కుటుంబం మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌లో నివసిస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో నిద్రించేవారని తేలింది. అర్ధరాత్రి సమయంలో ఆ ముగ్గురు అమ్మాయిలు గది నుండి బయటకు వెళ్లి తొమ్మిదో అంతస్తు నుండి దూకుతుంటే ఎవరూ ఎలా గమనించలేదనే ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. అది వారి సాధారణ దినచర్యలో భాగమని చేతన్ సమాధానం ఇవ్వడం పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. మరణించిన బాలికలు గత కొన్నేళ్లుగా పాఠశాలకు వెళ్లడం లేదని విచారణలో వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారి చదువు మాన్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారు గతంలో ఎక్కడ చదివారు, చదువులో వెనుకబడి ఉన్నారనే ఆరోపణల్లో నిజమెంత అనే కోణంలో పోలీసులు స్కూల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
అమ్మేసిన ఫోన్లు.. మాయమైన ఆధారాలు
పిల్లల వద్ద గతంలో రెండు మొబైల్ ఫోన్లు ఉండగా, అప్పుల బాధ తాళలేక చేతన్ వాటిని అమ్మేశాడు. ఒకటి ఆరు నెలల క్రితం, మరొకటి ఘటనకు 15 రోజుల ముందే అమ్మినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు IMEI నంబర్ల ద్వారా ఆ ఫోన్లను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డేటా రికవరీ ద్వారా ఏవైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోన్ల డేటా ద్వారా ఈ కేసును ఛేదించే ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.






