నేపాల్ TO శ్రీలంక వయా ఇండియా.. రూ. 10 కోట్ల డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించిన NCB

by Kema Shiva Kumar |

నేపాల్ నుంచి శ్రీలంకకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను ఎన్సీబీ ఛేదించింది. హైదరాబాద్, చెన్నైలలో నిర్వహించిన దాడుల్లో రూ.10 కోట్ల విలువైన హషీష్ ఆయిల్, చరాస్‌ను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

నేపాల్ TO శ్రీలంక వయా ఇండియా.. రూ. 10 కోట్ల డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించిన NCB
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఉక్కపాదం మోపింది. నేపాల్ నుంచి భారత్ మీదుగా శ్రీలంకకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ బిగ్ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన 77.6 కిలోల హషీష్ ఆయిల్ (Hashish Oil), 2 కిలోల చరాస్ (Charas)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ శ్రీలంక శరణార్థితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపరేషన్ జరిగిందిలా..

ఎన్సీబీ హైదరాబాద్ (NCB Hyderabad), చెన్నై జోనల్ యూనిట్లు సమన్వయంతో ఈ మల్టీ-స్టేట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మార్చి 3న బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ఉన్న ‘రైకల్ టోల్ ప్లాజా’ వద్ద ఒక టాటా సఫారి వాహనాన్ని ఎన్సీబీ అధికారులు తనిఖీ చేశారు. వాహనంలోని రహస్య అరలలో దాచిన 2 కిలోల చరాస్‌ను గుర్తించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని విచారించగా.. అప్పటికే ఒక భారీ కన్సైన్‌మెంట్ తమిళనాడులోని తూత్తుకుడికి చేరినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన చెన్నై ఎన్సీబీ అధికారులు తూత్తుకుడిలో తనిఖీలు చేసి 78 కిలోల హషీష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. ఇక్కడే ఓ శ్రీలంక (Srilanka) శరణార్థి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

నేపాల్ నుంచి శ్రీలంకకు సముద్ర మార్గంలో..

ఎన్సీబీ విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్‌లోని ఖాట్మండు (Khatmandu) నుంచి సోనౌలీ సరిహద్దు ద్వారా ఈ డ్రగ్స్‌ను భారత్‌లోకి తీసుకొచ్చారు. వీటిని తూత్తుకుడి తీరం నుంచి చేపల వేట పడవల్లో సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు తరలించాలని స్మగ్లర్లు ప్లాన్ చేశారు. అయితే, ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సహాయంతో సముద్ర సరిహద్దు వద్ద ఈ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ మొత్తం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను శ్రీలంకలో ఉన్న ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్లుగా ఎన్సీబీ గుర్తించింది. అతనే నేపాల్ నుంచి భారత్ మీదుగా శ్రీలంకకు డ్రగ్స్ పంపడానికి కావాల్సిన నిధులను, రవాణా సౌకర్యాలను సమకూర్చుతున్నాడు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేసేందుకు ఎన్సీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపడుతోంది.

Next Story