ఎయిర్‌పోర్టులో ఎన్‌సీబీ తనిఖీలు.. రూ.60 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-03 02:41:46  IST  )

దేశంలో డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌పోర్టులో ఎన్‌సీబీ తనిఖీలు.. రూ.60 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కొకైన్ అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో ఆడిస్ అబాబా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగేజీ నుంచి 5.6 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. కొకైన్ క్యాప్సూల్స్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌కు చెందిన మెరిసే చాక్లెట్‌లుగా చుట్టారు. వాటిని బంగారు రంగు బాక్సులలో ఎవరికీ అనుమానం రాకుండా భద్రపరిచారు. అయితే, నిందితులు ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాకు చెందిన హిమాన్షు షా (25), హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాకు చెందిన సాహిల్ అత్త్రి (26)గా గుర్తించారు. అదేవిధంగా ఒక నైజీరియన్ పౌరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పట్టుబడిన కొకైన్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.60 కోట్ల విలువ చేసుందని ఎన్‌సీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story