భారత్‌కు నార్కో-టెర్రరిస్ట్ షేరా అప్పగింత.. ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏ అరెస్ట్

by Malleboina Mahesh |

నార్కో-టెర్రరిస్ట్ ఇక్బాల్ సింగ్ అలియాస్ షేరాను పోర్చుగల్ నుండి భారత్‌కు రప్పించిన ఎన్ఐఏ. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న అధికారులు; నార్కో-టెర్రరిజంపై పోరులో కీలక విజయం.

భారత్‌కు నార్కో-టెర్రరిస్ట్ షేరా అప్పగింత.. ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ మద్దతుతో కొనసాగుతున్న నార్కో-టెర్రరిజంపై జరుపుతున్న పోరాటంలో భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఒక కీలక విజయాన్ని సాధించింది. మోస్ట్ వాంటెడ్ నార్కో-టెర్రరిస్ట్ ఇక్బాల్ సింగ్ అలియాస్ షేరాను (Shera) పోర్చుగల్ నుంచి విజయవంతంగా భారత్‌కు రప్పించి, ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ (HM) ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చే ప్రధాన కుట్రదారుడైన షేరాను, పోర్చుగల్ నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది.

2020లో భారతదేశం నుండి తప్పించుకుని పోర్చుగల్‌కు పారిపోయిన షేరాను రప్పించడానికి భారత ప్రభుత్వం సుదీర్ఘ దౌత్య, న్యాయ పోరాటం చేసింది. ఈ క్రమంలో జరిగిన అప్పగింత ప్రక్రియ (Extradition) తర్వాత నేడు అతడిని భారత భూభాగానికి తీసుకువచ్చారు. షేరా అరెస్ట్ సరిహద్దు దాటి జరుగుతున్న మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించడంలో ఎన్ఐఏకు పెద్ద ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే గత కేసులకు సంబంధించిన విచారణ జరిపి పూర్తి వివరాలను రాబట్టాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story