దంపతుల అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా ?

by Naga Rani Yarlagadda |

జైపూర్‌ నగరంలోని ముహానా ప్రాంతంలో ఓ వివాహిత జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలంగా మారింది.

దంపతుల అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా ?
X

దిశ, వెబ్‌డెస్క్: జైపూర్‌ నగరంలోని ముహానా ప్రాంతంలో ఓ వివాహిత జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలంగా మారింది. ధర్మేంద్ర, సుమన్ అనే దంపతులు తమ నివాసంలో మరణించిన స్థితిలో కనబడటంతో పోలీసుల దృష్టి అంతా అక్కడికే మళ్లింది. ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, పోలీసులు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర.. శుక్రవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆయన స్నేహితులు అతన్ని పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేశారు. స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని నివాసానికి వెళ్లగా, ధర్మేంద్ర, సుమన్ ఇద్దరూ మరణించిన స్థితిలో ఉండటం గమనించారు.

గురువారం మధ్యాహ్నం ఇద్దరూ వాగ్వాదం చేసుకున్న దృశ్యాలు అపార్ట్‌మెంట్‌ సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ వెంటనే వారు అన్యోన్యంగా ఉండి, కలిసి తిరిగి ఇంటికొచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. కాగా.. పోలీసులు ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఇంట్లోకి బలవంతంగా ఎవరూ ప్రవేశించలేదని పేర్కొన్నారు. అయితే.. సుమన్ తండ్రి మాత్రం తన కూతురు శరీరంపై గాయాలున్నాయని, ఇది హత్య అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ దంపతులు కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేసిన వారు. ధర్మేంద్ర ఉద్యోగంలో ఉన్నాడు. సుమన్ గృహిణిగా ఉండేది. వారికి ఉన్న ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఊరిలో ఉన్నారు. పోలీసులు దంపతుల ఫోన్లను ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపారు. సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాలు ఆధారంగా కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ మృతిపై ఉన్న మిస్టరీ త్వరలోనే వీడుతుందన్న నమ్మకంతో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story