MP Arrest: దేశ రాజకీయాల్లో సెన్సేషన్... ఫోర్జరీ కేసులో ఎంపీ అరెస్ట్

by Kema Shiva Kumar |

దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌ను శనివారం తెల్లవారుజామున పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.

MP Arrest: దేశ రాజకీయాల్లో సెన్సేషన్... ఫోర్జరీ కేసులో ఎంపీ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర (Independent) ఎంపీ పప్పు యాదవ్‌ (MP Pappu Yadav)ను శనివారం తెల్లవారుజామున పాట్నా పోలీసులు (Patna Police) అరెస్ట్ చేశారు. 1995 నాటి ఫోర్జరీ కేసులో ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అనివార్యమైంది. రాత్రి సుమారు 50 మంది పోలీసులు పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు పాట్నాలోని మండిరి ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మద్దతుదారులకు మధ్య తోపులాట జరిగింది.

నేను కోర్టును గౌరవిస్తా.. పప్పు యాదవ్

అరెస్ట్ సమయంలో పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, సాదాసీదా దుస్తుల్లో వచ్చిన ఓ అధికారి వద్ద ఆయుధం ఉందని ఆయన ఆరోపించారు. తాను కోర్టును గౌరవిస్తానని, ఉదయం 11 గంటలకు తానే స్వయంగా హాజరవుతానని పోలీసులతో వాదించారు. చివరకు అర్ధరాత్రి దాటాక పోలీసులు పప్పు యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఐజీఐఎంఎస్ (IGIMS) ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గర్దానీబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

కేసు నేపథ్యం ఇలా..

1995లో పాట్నాలోని గర్దానీబాగ్ (Gardanibagh) పోలీస్ స్టేషన్‌లో వినోద్ బిహారీ లాల్ (Vinod Bihari Lal) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పప్పు యాదవ్‌పై కేసు నమోదైంది. ఎంపీ కార్యాలయం కోసం వినోద్ బిహారీ లాల్ వద్ద ఆస్తిని అద్దెకు తీసుకునే క్రమంలో పప్పు యాదవ్ మోసపూరితంగా ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో చాలా కాలంగా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇటీవలే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అయితే, పప్పు యాదవ్‌పై రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పాట్నా హాస్టళ్లలో జరుగుతున్న వ్యభిచార ముఠాల గురించి, అలాగే ఒక నీట్ (NEET) అభ్యర్థి మరణం గురించి ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే తనపై ఈ చర్య తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని ఢిల్లీ నుంచి రాగానే తనను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పప్పు యాదవ్ ఆరోపించారు.

Next Story