- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదెక్కడి చిత్రం సిగ్గు సిగ్గు.. ఏకంగా సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్సై!
పోలీసులు దారి తప్పుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్/సిటీ క్రైం: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ అంబర్‌పేట్ పీఎస్‌లో ఎస్సై భానుప్రకాష్ కన్నింగ్ మెంటాలిటీ పోలీసు ప్రతిష్టను దిగజార్చింది. క్రైం కేసులను డిటెక్ట్ చేయాల్సిన ఎస్సై ఆ కేసుల్లో దొరికిన సోత్తును కాజేసి తెలివిగా కేసును కూడా క్లోజ్ చేసేశాడు. చివరకు అతని రక్షణ కోషం ఇచ్చిన 9MM రివాల్వర్‌ను కూడా అమ్మేసుకున్నాడనే ప్రచారంతో ఎస్ఐ భానుప్రకాశ్ వ్యవహారం హైదరాబాద్ పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఎస్సైకి కేటాయించిన పిస్తోలు దొరకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఎస్ఐ భానుప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రివాల్వర్‌ను రాయసలసీలోని ఓ ముఠాలకు అమ్మేశాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు పోలీసు శాఖలో చర్కర్లు కొడుతున్నాయి. పిస్టల్ మిస్సింగ్ మిస్టరీని చేధించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఎస్సై క్రైం బయటపడింది ఇలా...
2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొన్ని ఠాణాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం అంబర్‌పేట్ పీఎస్ క్రైం ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇటీవల పీఎస్‌లో నమోదైన 4 తులాల బంగారం చోరీ కేసులో దర్యాప్తు చేపట్టాడు బంగారాన్ని రికవరీ చేశాడు. కానీ, ఆ బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా వారి బంగారాన్ని వారికి అప్పగిస్తానని చెప్పి వారితో లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేసేశాడు. ఆ తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా భానుప్రకాష్ దానిని అమ్మేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో అతడి మీద కేసును నమోదు చేసి సస్పెండ్ చేశారు.
ఏపీలో గ్రూపు-2 ఉద్యోగం వచ్చిందని..
సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భానుప్రకాష్ ఇటీవల అంబర్‌పేట్ పీఎస్‌కు వచ్చాడు. తనకు ఏపీలో గ్రూపు-2 ఉద్యోగం వచ్చింది ఇక తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అక్కడ ఉద్యోగంలో చేరుతానని తోటి ఉద్యోగులకు చెప్పాడు. స్టేషన్‌లో తన వస్తువులను తీసుకోవడానికి వచ్చానని నమ్మించాడు. ఆ తర్వాత స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వద్దకు వెళ్లి తన డ్రాలో పెట్టిన 9 MM పిస్టల్ కనపడడం లేదు కొంచెం సీసీ టీవీ కెమెరాలు చూడాలని అడిగాడు. అనంతరం పోలీసుస్టేషన్ ఉన్నతాధికారు సమక్షంలో డ్రాను తీసి వెతకగా బుల్లెట్లు మాత్రమే దొరికాయి కానీ పిస్టల్ కనిపించలేదు. దీంతో ఎస్సై భానుప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, సీసీ కెమెరాలను పరిశీలించిప్పడు భానుప్రకాష్ రికవరీ చేసిన 4 తులాల బంగారం ఆభరణాలను డ్రాలో పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లినట్లుగా పోలీసులకు ఫుటేజీ కూడా లభ్యమైంది.
బెట్టింగ్‌లో రూ.80 లక్షలు హాంఫట్..
తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సైగా జాయిన అయిన భానుప్రకాష్ ఏ రోజూ సరిగా డ్యూటీ చేయలేదని తెలిసింది. ఎప్పుడు లీవ్‌లు పెడుతూ తాను గ్రూపు -1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని డ్యూటీకి తక్కువగా వచ్చే వాడని విచారణలో తేలింది. ఈ సందర్భంలోనే అతను బెట్టింగ్ మాయలో పడి దాదాపు రూ.70 నుంచి రూ.80 లక్షల వరకు పొగొట్టుకున్నాడని తెలుస్తోంది. చేసిన అప్పును తీర్చేందుకే భానుప్రకాష్ క్రిమినల్ చర్యలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడని సమాచారం. తనకు కేటాయించిన రివాల్వర్‌ను రాయలసీమ ముఠాకు అమ్మాడా.. లేక ఇతర క్రిమినల్స్‌కు విక్రయించాడా అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భానుప్రకాష్ మాత్రం గన్ గురించి తనకు తెలియదని డ్రాలోనే పెట్టానని విచారణలో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ, ఇదే విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. రివాల్వర్ దొరికిన తర్వాతే అధికారులు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రికవరీ సోత్తును కొట్టేసిన భానుప్రకాష్‌పై అంబర్‌పేట్ పోలీసులు కేసును నమోదు చేశారు.






