బంధుత్వం ముసుగులో నరరూప రాక్షసుడు.. కళాశాలకు తీసుకెళ్తానంటూ అసభ్య ప్రవర్తన

by Bhanu |   (  Updated:2025-07-18 07:47:23  IST  )

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఓ మైనర్ బాలిక తన సమీప బంధువు చేతిలో

బంధుత్వం ముసుగులో నరరూప రాక్షసుడు.. కళాశాలకు తీసుకెళ్తానంటూ అసభ్య ప్రవర్తన
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఓ మైనర్ బాలిక తన సమీప బంధువు చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఘటన కలకలం రేపుతోంది. వరుసకు మేనమామగా అయ్యే వ్యక్తి బాలికను కళాశాలకు తీసుకెళతానని చెప్పి బైక్ ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. అప్రమత్తమైన బాలిక ధైర్యంగా బైక్ పై నుంచి దూకి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట సమీపంలోని వడ్డేపల్లికి చెందిన మైనర్ బాలిక, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ వొకేషనల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమెను కళాశాలకు తీసుకెళతానని చెప్పిన అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ ఆమెను బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. కళాశాల వైపు కాకుండా హైదరాబాద్ రోడ్డులోకి మళ్లించి, ఎల్ఎండి పరిసర ప్రాంతాల వైపు తీసుకెళ్తుండగా బాలిక అనుమానం వ్యక్తం చేసి అప్రమత్తమైంది.

బైక్‌పై అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన బాలిక, కాకతీయ కెనాల్ సమీపంలో బైక్ పై నుంచి దూకి తప్పించుకుంది. దీంతో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఆవేదనతో ఉన్న బాలికను అక్కడికి చేరుకున్న పోలీసులు తక్షణమే స్టేషన్‌కి తీసుకెళ్లారు.


ఈ ఘటనపై ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ స్పందిస్తూ.. నిందితుని కోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే అతడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలిక ధైర్యంగా వ్యవహరించిన తీరు ప్రశంసించారు..

Next Story