సుత్తితో కొట్టి.. కత్తితో కోసి.. ప్రియుడిని హతమార్చి ‘కూల్’గా పోలీసులకు ఫోన్ చేసిన వివాహిత

by Bhoopathi Nagaiah |

అక్రమ సంబంధాలు, బ్లాక్ మెయిలింగ్ చివరకు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో ఈ హత్య మరోసారి నిరూపించింది.

సుత్తితో కొట్టి.. కత్తితో కోసి.. ప్రియుడిని హతమార్చి ‘కూల్’గా పోలీసులకు ఫోన్ చేసిన వివాహిత
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు వారిద్దరూ ప్రేమికులు.. కానీ గంట తిరగకముందే ఒకరు శవమయ్యారు, మరొకరు హంతకురాలయ్యారు. ఆగ్రాలో శుక్రవారం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఆ మహిళ, ఏమాత్రం తడబాటు లేకుండా వ్యవహరించిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు.

హోటల్ గదిలో ఏం జరిగింది?

29 ఏళ్ల ఒక వివాహిత తన 36 ఏళ్ల ప్రియుడితో కలిసి ఉదయం 11 గంటల సమయంలో ఆగ్రాలోని ఒక హోటల్‌కు వచ్చింది. వీరిద్దరూ దూరపు బంధువులు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, గదిలోకి వెళ్ళిన గంట సేపటికే పరిస్థితి తలకిందులైంది. లోపల ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆవేశంతో ఊగిపోయిన సదరు మహిళ, తన వెంట తెచ్చుకున్న సుత్తితో ప్రియుడి తల మీద బలంగా బాదింది. అతను స్పృహ కోల్పోగానే, కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది.

రిసెప్షన్‌లో 'డెడ్లీ' కాన్ఫిడెన్స్

హత్య చేసిన అనంతరం ఆ మహిళలో ఎలాంటి భయం గానీ, పశ్చాత్తాపం గానీ కనిపించకపోవడం గమనార్హం. రక్తపు మరకలను తుడుచుకుని, నిదానంగా కిందకు వచ్చి హోటల్ రిసెప్షన్ వద్ద నిలబడింది. అక్కడి నుంచే నేరుగా పోలీసులకు ఫోన్ చేసి.. "నా ప్రియుడిని చంపేశాను.. సుత్తితో కొట్టి, కత్తితో గొంతు కోశాను. బాడీ పైన రూమ్‌లో ఉంది.. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, రండి" అని అత్యంత ప్రశాంతంగా చెప్పడంతో హోటల్ సిబ్బంది భయంతో వణికిపోయారు. పోలీసులు వచ్చే వరకు ఆమె అక్కడే కూల్ గా కూర్చోవడం ఆమె 'క్రిమినల్ మైండ్‌సెట్'కు అద్దం పడుతోంది.

బ్లాక్ మెయిలింగ్ వేధింపులే కారణమా?

పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలికి వివాహమై ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. మృతుడు తన దూరపు బంధువు కావడంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, గత కొంతకాలంగా అతను తనను ఆర్థికంగా, వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతని వేధింపులు తట్టుకోలేకే అంతం చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె వాంగ్మూలం ఇచ్చింది.

ముందస్తు ప్రణాళికతోనే హత్య?

సాధారణంగా గొడవ జరిగినప్పుడు ఆవేశంలో చేసే హత్యలకు, సుత్తి, కత్తిని వెంట తెచ్చుకుని చేసే హత్యలకు చాలా తేడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆమె తన వెంట మారణాయుధాలను తెచ్చుకోవడాన్ని బట్టి చూస్తే, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం బెదరకుండా తానే స్వయంగా వ్యాన్ ఎక్కి స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ఆ గదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా ఆమె ఒక్కతే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story