నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. కారు సర్వీసింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఉప్పర్‌పల్లి (Upparpally)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. కారు సర్వీసింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఉప్పర్‌పల్లి (Upparpally)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సకాలంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ఈ ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆగ్రహం

ఈ ఘటనపై కాలనీవాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్య సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి కేంద్రాలు నిర్వహించడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ప్రమాదంపై సర్వీసింగ్ సెంటర్ యజమానులు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఎవరో కావాలనే తమ సెంటర్‌కు నిప్పంటించారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story