తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

by Gantepaka Srikanth |

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఈ-ప్యాక్ (E-pack) పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు, పరిశ్రమ కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల ధాటికి కంపెనీలోని ముడిసరుకు, యంత్రాలు కాలి బూడిదవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడుకు పైగా ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాలి ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా.

భయాందోళనలో స్థానికులు..

పరిశ్రమ నుండి వెలువడుతున్న దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర కనిపిస్తుండటంతో శ్రీసిటీ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story