రాష్ట్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-13 09:56:55  IST  )

అగ్ని ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు కాలిబూడిదైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరగడంతో ఆరుగురు కాలిబూడిదైన ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోటవురట్ల మండల పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఉన్నట్టుండి మంటలు ఎగసిపడి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను సామర్లకోట వాసులుగా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఫైర్ సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత పరామర్శించారు. బాణాసంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాధితులను మొదటి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం కి తరలించారు. ఆస్పత్రికి తరలించిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి జిల్లా అధికారులు చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చాలా దూరంగా ఉంది. ఈ బాణసంచా తయారీ కేంద్రంలో తారాజువ్వలు, ఊరేగింపులకు ఉపయోగించే బాణసంచా తయారు చేస్తారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బాణసంచా తయారీ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. బయట జిల్లాల నుంచి కార్మికులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

Next Story