- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. ఎతిహాద్ విమానంలో మంటలు
చెన్నై ఎయిర్‌పోర్టులో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు ముందు ఎతిహాద్ విమానం రెక్కల్లో మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Chennai International Airport)లో ఇవాళ పెను ప్రమాదం తప్పింది. అబుదాబి (Abu Dhabi) వెళ్లాల్సిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) విమానంలో టేకాఫ్‌కు సరిగ్గా కొద్ది నిమిషాల ముందు మంటలు చెలరేగాయి. పైలట్ల అప్రమత్తతతో విమానంలోని 280 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎతిహాద్ విమానం ఉదయం చెన్నై నుంచి అబుదాబికి బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికులందరూ విమానం ఎక్కిన తర్వాత, రన్‌వేపైకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా విమానం ఎడమ రెక్క (Left Wing) భాగంలో మంటలు చెలరేగడాన్ని పైలట్లు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు విమానాన్ని నిలిపివేసి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు.
ఈ మేరకు విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పేశారు. విమానంలోని 280 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సాంకేతిక కారణాల వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. విమానాన్ని ప్రస్తుతం గ్రౌండ్ చేసి, పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానం రద్దు కావడంతో అబుదాబి వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ఎతిహాద్ ఎయిర్‌లైన్ సంస్థ ప్రయత్నిస్తోంది.






