YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక మలుపు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

by Ramesh Naini |

‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్‌ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది.

YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక మలుపు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్‌ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ వివరాలను అందించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ నుంచి అధికారిక ప్రతిస్పందన కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

స్పందించకపోతే లుక్‌అవుట్ నోటీసులు: సీఐ రామకృష్ణ

విదేశాల్లో ఉంటూ అన్వేష్ హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు అందిన వెంటనే నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట సీఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

వెంటనే అరెస్ట్ చేయాలి.. నటి కరాటే కల్యాణి

ఇదిలా ఉండగా, యూట్యూబర్ అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవతలను అవమానించారని ఆరోపిస్తూ అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. హిందూ సంఘాల నేత, నటి కరాటే కల్యాణి మీడియాతో మాట్లాడుతూ, అన్వేష్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అన్వేష్ వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామని కరాటే కల్యాణి వెల్లడించారు. హైదరాబాద్ సీపీ ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన అన్వేష్ అనే యువకుడు విదేశాల్లో ఉంటూ ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల ఇటీవల వీడియో విడుదల చేశాడు. ఈ అంశంపై నెటిజన్లు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.

Next Story