మంగ్లీకి బిగుస్తున్న ఉచ్చు: మైక్రో ఫైనాన్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

మంగ్లీకి బిగుస్తున్న ఉచ్చు: మైక్రో ఫైనాన్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వందల కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్ లావాదేవీలపై సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం మూడు విడతల్లో మధు డబ్బులు పంపినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ల ద్వారా స్పష్టమైంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శివ చౌహాన్ అకౌంట్లోకి డబ్బులు జమ అయిన తర్వాతి రోజే ఆ నగదును విత్ డ్రా (నగదు ఉపసంహరణ) చేసినట్లు విచారణలో తేలింది.

బ్యాంకులకు పోలీసుల లేఖ..

ఈ వ్యవహారంలో పక్కా ఆధారాల కోసం సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావత్ మధు బ్యాంక్ అకౌంట్‌ను సీజ్ చేసిన అధికారులు.. పూర్తి వివరాల కోసం బ్యాంక్ యాజమాన్యాలకు లేఖలు రాశారు. రమావత్ మధుతో పాటు హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్‌లకు చెందిన బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్లు, నగదు లావాదేవీల పూర్తి నివేదికను ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ఇప్పటికే మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, నిందితుడి ఖాతా నుండి నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి మళ్లింది? దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story