సీసీ కెమెరాలకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ

by Bhoopathi Nagaiah |

వైన్స్ షాపుల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

సీసీ కెమెరాలకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ
X

దిశ, నల్లగొండ క్రైం: వైన్స్ షాపుల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ రాత్రి నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్‌లో గల మహాలక్ష్మి వైన్ షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తి సుమారు రూ.5లక్షలకు పైగా నగదు దోచుకెళ్లినట్లు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వైన్ షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా, గతంలో పలు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసిన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మచ్చయపాలెం గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహారావుగా గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కే.శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం దేవరకొండ రోడ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నల్లగొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి వద్ద నుంచి మహాలక్ష్మి వైన్ షాప్ దొంగతనానికి సంబంధించిన రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లుగా ఆయన తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్ఐలు సతీష్, లచ్చిరెడ్డి, వెంకటనారాయణ, సిబ్బంది అంజయ్య, రబ్బానీ శ్రీనులను డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారని చెప్పారు.

Next Story