అంతర్జాతీయ సైబర్ ముఠా అరెస్ట్: 600కు పైగా భారతీయ సిమ్ కార్డులతో భారీ మోసం

by Kema Shiva Kumar |

కంబోడియా, చైనా కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పట్టేసింది.

అంతర్జాతీయ సైబర్ ముఠా అరెస్ట్: 600కు పైగా భారతీయ సిమ్ కార్డులతో భారీ మోసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంబోడియా, చైనీస్ సైబర్ ముఠాతో సంబంధం ఉన్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్ బుధవారం వెల్లడించారు. నిందితులు 600కు పైగా భారతీయ సిమ్ (SIM) కార్డులను అక్రమంగా వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కంబోడియా కేంద్రంగా పనిచేస్తూ భారతీయ పౌరుల నుండి కోట్లాది రూపాయలను వీరు మోసం చేసినట్లు వెల్లడించారు.

మార్చి 31వ తేదీన నిందితులు 198 సిమ్ కార్డులను కంబోడియాకు తరలిస్తుండగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో సైబర్ సెక్యూరిటీ అధికారులు రంగంలోకి దిగి.. యూపీకి చెందిన రిజ్వాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఆష్రఫ్ అలీ అనే నిందితులను అరెస్ట్ చేశారు. వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్, కరీంనగర్‌కు చెందిన నూనె అశోక్లను కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

రిజ్వాన్‌పై గతంలోనే సైబర్ సెక్యూరిటీ విభాగంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిందితుడు సయ్యద్ ఆష్రఫ్ అలీ ఒక హోటల్‌లో పనిచేస్తుండగా, రిజ్వాన్ దుబాయ్‌లోని ఒక గేమింగ్ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. భారతీయ సిమ్ కార్డులను సరఫరా చేసినందుకు ఆష్రఫ్ అలీకి భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని రిజ్వాన్ ఆశ చూపాడు. ఆ డబ్బుకు ఆకర్షితుడై ఆష్రఫ్ సిమ్ కార్డులను సేకరించడం ప్రారంభించాడు.

సోహైల్ జియో (Jio)లో ప్రమోటర్‌గా పనిచేస్తుండగా, అతనికి ఎయిర్‌టెల్ (Airtel) POS కూడా ఉన్నట్లు గుర్తించారు. అతీక్, అశోక్ లు కూడా ఎయిర్‌టెల్ POS నడుపుతున్నట్లు తెలిసింది. వీరంతా కలిసి నకిలీ ఐడెంటిటీ కార్డులతో 600కు పైగా సిమ్ కార్డులను సేకరించారు. ఈ ముఠాకు కొరియర్‌గా పనిచేస్తున్న అరవింద్ కుమార్ అలియాస్ షాహిద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, విదేశాలలో పనిచేస్తున్న వారితో సహా ఈ నెట్‌వర్క్‌లోని మిగిలిన సభ్యులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డీజీ వెల్లడించారు.

Next Story