ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిందెవరు?

by Disha Web Desk 2 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిందెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో ఈడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నిస్తున్న అధికారులు దర్యాప్తును లాజికల్ ఎండ్ దిశగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత సీబీఐ గుర్తించిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళైను విచారించడంతో లింకులు దొరికాయి. కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. సోదాలు జరపడం ద్వారా దర్యాప్తు ప్రక్రియ ముమ్మరమైంది. లెక్కల్లోకి కనిపించని డబ్బు ఒకచోటి నుంచి మరో చోటుకు బదిలీ కావడం, వీటిని సమకూర్చినవారి వివరాలు వెలుగులోకి రావడంతో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఢిల్లీకి చేరుకున్నది. ఇప్పటికే ఒకరు అప్రూవర్‌గా మారడానికి సిద్ధమైనట్లు సమాచారం. కీలకమైన మరో వ్యక్తి కూడా ఇదే తరహాలో మారడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో తెరవెనక సూత్రధారుల పేర్లు వారి వాంగ్మూలం ద్వారా బైటపడితే ఈడీ అధికారుల పని సులవవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అప్రూవర్‌గా మారడానికి సిద్ధమైనదెవరు? ఒత్తిడికి గురవుతున్న మరొకరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారు ఇచ్చే స్టేట్‌మెంట్‌ తర్వాత లిక్కర్ స్కాంలో తెరవెనక ఉండి చక్రం తిప్పినవారి పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉన్నది. మీడియేషన్ చేసినవారెవరు? డబ్బును సమకూర్చినవారెవరు? ఎవరికి ఎవరు బినామీలు? ఏయే కంపెనీల నుంచి డబ్బు అందింది? హవాలా మార్గంలో మొత్తం చేతులు మారిన డబ్బు ఎంత?.. తదితర వివరాలన్నీ బైటకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ప్రకారం ఆయా వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే ప్రక్రియను ఈడీ వేగవంతం చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే వెన్నమనేని శ్రీనివాసరావును హైదరాబాద్‌‌లో ప్రశ్నించిన ఈడీ టీమ్‌లు ఈసారి ఢిల్లీ ఆఫీసులో ప్రశ్నించడానికి నోటీసులు జారీ చేసింది. ఆ ప్రకారం ఈ నెల 26న ఢిల్లీ వెళ్ళనున్నారు.

బినామీ ఆస్తులపైనే దృష్టి

లిక్కర్ వ్యాపారంతో సంబంధం లేని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల పేర్లు ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెరమీదకు రావడంతో బినామీ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో సోదాలు జరిపిన తర్వాత లభ్యమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్‌లో ఉన్న ఆడిట్ రిపోర్టులు, హార్డ్ డిస్కు, పెన్ డ్రైవ్‌లలో ఉన్న సమాచారం ఆధారంగా ఈడీ టీమ్‌లు పలువురికి నోటీసులు జారీచేశాయి. ఆ వివరాల ఆధారంగానే వెన్నమనేని లాంటి పేర్లు తెరమీదకు వచ్చాయి. బుచ్చిబాబు గతంలో పలు కంపెనీలకు ఆడిటర్‌గా వ్యవహరించడంతో పాటు ప్రస్తుతం టీఆర్ఎస్ నేతల్లో కొందరికి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఆయా కంపెనీలు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయి, వాటిలో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు, అవి అర్ధంతరంగా మూసివేయడానికి చూపించిన కారణాలు, డైరెక్టర్లుగా వైదొలిగిన కంపెనీల్లోని షేర్ల విలువ తదితరాలన్నింటిపై ఈడీ ఫోకస్ పెట్టింది.

చాలా కంపెనీలు ఒకే అడ్రస్‌పై ఉండడం ఈడీ దర్యాప్తులో అనేక అనుమానాలకు దారితీసింది. కేవలం ఆర్థిక లావాదేవీల కోసమే వీటిని పెట్టినట్లు అభిప్రాయపడ్డారు. షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు లాంటి ఆరోపణలు ఎలా ఉన్నా ఒకదానితో మరోదానికి ఉన్న సంబంధం, కొన్నింటిని మూసివేసిన తర్వాత ఆ ఇన్వెస్టుమెంట్లను వేరే కంపెనీల్లో ఏ రూపంలో పెట్టుబడిగా పెట్టారు తదితరాలన్నింటినపైనా ఈడీ టీమ్‌లు శోధిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో అప్రూవర్‌లుగా మారినట్లయితే ఈడీ అధికారులకు ఉపశమనంగా మారుతుంది. కానీ అదే సమయంలో ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయోననే గుబులు కొద్దిమందిలో మొదలైంది. ఈ స్కామ్ చివరకు తమ మెడకు చుటుటకుంటుందేమోననే ఆందోళన కూడా పలువురిని వేధిస్తున్నది.

మద్యం కుంభకోణం ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినదే అయినా ఈడీ దర్యాప్తు మాత్రం తెలంగాణలో కేంద్రీకృతమైంది. రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేసిన ఈడీ కొద్దిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. వెన్నమనేని శ్రీనివాసరావును సోమవారం ఢిల్లీలో రెండోసారి విచారించనున్నది. ఇప్పటికే ఆయన మొబైల్, కంప్యూటర్, హార్డ్ డిస్కు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించిన ఈడీ 'సిగ్నల్ యాప్' ద్వారా పిళ్ళైతో జరిపిన సంభాషణలను రికవరీ చేసింది. ఫోన్‌లోని మరికొన్ని వివరాలను రాబట్టడానికి ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని తీసుకున్నది. పలు కంపెనీల ఆదాయపు పన్ను రిటన్‌లలో పేర్కొన్న వివరాలను, ఆడిటర్ రిపోర్టుల్లోని గణాంకాలతో పోల్చే పని కూడా జరుగుతున్నది.

ఇకపైన అప్రూవర్‌గా మారే పరిణామాలకు అనుగుణంగా ఈడీ దర్యాప్తు ప్రక్రియ మరో షేప్ తీసుకోనున్నది. అప్రూవర్‌గా మారేవారి పేర్లు బైటకు వస్తే దాని ప్రభావం తెలంగాణలోని ఎవరిపైన ఏ మేరకు ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి.


Next Story

Most Viewed