- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్ : గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చిచ్చుపెడుతున్నాయి. పార్టీలు, వర్గాల మధ్య ఆధిపత్యంతో ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలతోనే కాకుండా ఒకే పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో బీభత్సం సృష్టించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూర్ నగర్ నియోజకవర్గం, చింతలపాలెం మండలం కృష్ణాపురంలో మైనారిటీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో పార్టీ ఒక్కరే పోటీ చేయాలని సూచించినా పట్టించుకోకుండా ఇద్దరూ బరిలో నిలిచారు. దీంతో గ్రామానికి చెందిన మైనారిటీ రెండువర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో ఓ వర్గం ఇతర సామాజికవర్గ అభ్యర్థికి మద్దతు ఇస్తుందన్న అనుమానంతో దాదా బుడే వర్గీయులు షేక్ గపూర్, షేక్ సైదా, ఇస్మాయిల్ వర్గంపై రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇళ్లపైకి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇరువర్గాల దాడిలో ఆరు బైకులు, ఒక టాటా ఏసీ వాహనం ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగడంతో గ్రామస్తులు హడలిపోయారు. చీకట్లో పరుగులు తీశారు. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు. సమాచారం అందుకున్న చింతలపాలెం పోలీసులు హూటాహూటిన కృష్ణాపురం చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాలో సీనియర్ మినిస్టర్ గా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు నెలకొని కత్తులు దూసుకోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.






