హైదరాబాద్‌లో అమానుషం.. భర్త మరణం తర్వాత అత్తగారింట్లో కోడలికి నో ఎంట్రీ!

by Gantepaka Srikanth |

కట్టుకున్న భర్త కాలం చేస్తే ఆ ఆవేదనలో ఉన్న కోడలిని అక్కున చేర్చుకోవాల్సిన అత్తమామలు.. ఆమెను గడప దాటనివ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటన హైటెక్ సిటీ నడిబొడ్డున వెలుగుచూసింది.

హైదరాబాద్‌లో అమానుషం.. భర్త మరణం తర్వాత అత్తగారింట్లో కోడలికి నో ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్త కాలం చేస్తే ఆ ఆవేదనలో ఉన్న కోడలిని అక్కున చేర్చుకోవాల్సిన అత్తమామలు.. ఆమెను గడప దాటనివ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటన హైటెక్ సిటీ నడిబొడ్డున వెలుగుచూసింది. మాదాపూర్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు దీన కుమారి వివరాల ప్రకారం.. తన భర్త మరణించిన తర్వాత అత్తమామల వైఖరి పూర్తిగా మారిపోయింది. "కొడుకు పోయాక నీతో మాకేం సంబంధం?" అంటూ ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా గేట్లు మూసేశారు. కనీసం తన సామాన్లు తీసుకోవడానికి కూడా అనుమతించకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నారు.

పిల్లలకూ తప్పని అవమానం..

అంతటితో ఆగకుండా, తమ రక్తానికి వారసులుగా పుట్టిన మనవలు, మనవరాళ్లను సైతం అత్తగారి కుటుంబం గుర్తించడానికి నిరాకరిస్తోంది. ఓ తల్లికి ఇంతకంటే అవమానం ఏముంటుందని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. న్యాయంగా తనకు దక్కాల్సిన హక్కు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం దీన కుమారి గత 20 రోజులుగా అత్తవారింటి ముందే చలిలో, ఎండలో కాలం గడుపుతోంది. ఇంటి బయటే ఉంటూ తన గోడును వెళ్లబోసుకుంటోంది. ఎన్నిసార్లు వేడుకున్నా అత్తగారి వైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. "నా భర్త లేని లోటు తీర్చలేనిది. కానీ ఉన్న ఇద్దరు పిల్లలతో నేను ఎక్కడికి వెళ్లాలి? పోలీసులు, మహిళా సంఘాలు స్పందించి మాకు న్యాయం చేయాలి," అని దీన కుమారి వేడుకుంటోంది.

Next Story