విచక్షణారహితంగా పెద్దపులి దాడి.. అడవికి వెళ్లిన నలుగురు మహిళలు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-22 07:19:31  IST  )

బీడీ ఆకుల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి చంపేసింది.

విచక్షణారహితంగా పెద్దపులి దాడి.. అడవికి వెళ్లిన నలుగురు మహిళలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని చంద్రపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సిందేవాహి తాలూకా పరిధిలోని గుంజేవాహి అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం పులి దాడి (Tiger)లో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అడవిలోకి బీడీ ఆకులను సేకరించడానికి వెళ్లిన వారిపై పులి ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు, ఉద్రిక్తత నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అటవీ ఉత్పత్తులైన తేందూ ఆకుల సేకరణ సీజన్ ప్రారంభం కావడంతో స్థానికంగా ఉంటున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అటవీ ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున గుంజేవాహి గ్రామానికి చెందిన కొందరు మహిళలు అడవిలోకి వెళ్లారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో దట్టమైన పొదల్లో మాటువేసిన ఒక పులి మహిళలపై ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది. పులి వేగం, భీకరంగా దాడితో ఆ మహిళలకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. పులి పంజా విసరడంతో తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారిలో కవ్దూబాయ్ దాదాజీ మోహుర్లే (45), అనుబాయ్ దాదాజీ మోహుర్లే (46), సంగీతా సంతోష్ చౌదరి (36), సునితా కౌశిక్ మోహుర్లే (33) ఉన్నారు.

అయితే, ఒకే దాడిలో నలుగురు మహిళలు మరణించారనే వార్త తెలియగానే స్థానిక అటవీ శాఖ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్ తన సిబ్బందితో కలిసి తక్షణమే స్పాట్‌కు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రాథమిక విచారణను పూర్తి చేశారు. ప్రస్తుతం అటవీ శాఖ ఆ ప్రాంతంలో నిఘా, గస్తీని తీవ్రతరం చేసింది. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ప్రజలు ఒంటరిగా వెళ్లకుండా, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story