కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య

by Malleboina Mahesh |

కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న 30 ఏళ్ల భారతీయ యువతి దారుణంగా హత్యకు గురయ్యారు. మృతురాలిని హిమాన్షి ఖురానా గా గుర్తించారు.

కెనడాలో భారతీయ యువతి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న 30 ఏళ్ల భారతీయ యువతి దారుణంగా హత్యకు గురయ్యారు. మృతురాలిని హిమాన్షి ఖురానా గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్న అబ్దుల్ గఫూరీ (32) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కెనడా వ్యాప్తంగా 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' వారెంట్ జారీ చేసిన టొరంటో పోలీసులు, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డిసెంబర్ 19, శుక్రవారం రాత్రి హిమాన్షి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మరుసటి రోజు (శనివారం) ఉదయం సుమారు 6:30 గంటలకు స్ట్రాచన్ అవెన్యూ మరియు వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలోని ఒక నివాసంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఇది హత్యగా నిర్ధారించబడింది. మృతురాలు మరియు నిందితుడు ఒకరికొకరు ముందే తెలుసని, ఇది సన్నిహితుల మధ్య జరిగిన హింసగా (Intimate partner violence) అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.

భారత రాయబార కార్యాలయం స్పందన..

ఈ ఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం (Consulate General of India) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హిమాన్షి మృతి పట్ల సంతాపం ప్రకటించిన అధికారులు, ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకునే విషయంలో స్థానిక పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మరియు బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story