హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉదంతం.. ఉరేసుకుని బాధిత యువతి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-10 07:41:00  IST  )

హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో బాధిత యువతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉదంతం.. ఉరేసుకుని బాధిత యువతి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించిన అమ్మాయికి ఓ యువకుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. బాధిత యువతి ఇవాళ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 11న పెళ్లికి నిరాకరించినందుకు ప్రేమికుడు ఆ యువతికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించి పారిపోయాడు. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహాలో పగ..

అన్నోజిగూడకు చెందిన మనోహర్ అనే యువకుడు కొంతకాలంగా తన మేనమరదలిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఇటీవలే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయాడు. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’ తరహాలో ఆమెపై పగ తీర్చుకోవాలని మనోహర్ నిర్ణయించుకున్నాడు. యువతిపై పీకలదాకా కక్ష పెంచుకుని, తనకు ఉన్న ఎయిడ్స్ వ్యాధిని ఆమెకు అంటించాలనుకున్నాడు. వివాహానికి పనులు దగ్గర పడుతున్న క్రమంలో, ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ యువతి తీవ్ర జ్వరంతో బాధపడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. రిపోర్టులు చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆ యువతికి హెచ్ఐవీ (HIV) పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

పెళ్లికి ముందు ఆరోగ్యంగా ఉన్న తన కూతురికి ఇలా ఎయిడ్స్ రావడం వెనుక మనోహర్ చేసిన కుట్ర ఉందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా.. జీవితంపై విరక్తితో బాధిత యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Next Story