‘భార్య లావుగా ఉంది.. ఎక్కువ తిండి తింటుంది’ అంటూ హత్య

by Bhoopathi Nagaiah |

ప్రేమించి పెళ్లాడి, ఏడడుగులు నడిచిన భర్తే ఆమె పాలిట మృత్యువయ్యాడు. కేవలం "భార్య లావుగా ఉంది.. ఎక్కువ తిండి తింటుంది" అని దారుణంగా హత్య చేశాడు.

‘భార్య లావుగా ఉంది.. ఎక్కువ తిండి తింటుంది’ అంటూ హత్య
X

దిశ, కడప : ప్రేమించి పెళ్లాడి, ఏడడుగులు నడిచిన భర్తే ఆమె పాలిట మృత్యువయ్యాడు. కేవలం "భార్య లావుగా ఉంది.. ఎక్కువ తిండి తింటుంది" అనే అత్యంత విడ్డూరమైన, అమానవీయ కారణంతో ఒక పసిపాప తల్లిని కడతేర్చిన ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ వెల్లడించారు. ముద్దనూరుకు చెందిన బెంగుళూరు రాజకుల్లాయి కుమార్తె పద్మకు, భద్రిపల్లి కిరణ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. పెళ్లయినప్పటి నుండి కిరణ్ తన అత్తగారి ఇంట్లోనే (ముద్దనూరు) నివాసముంటున్నాడు. అయితే, కొంతకాలంగా భార్య శారీరక రూపంపై అసహ్యం పెంచుకున్న కిరణ్, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని క్రూరమైన పథకం వేశాడు.

​నెట్‌లో సెర్చ్ చేసి విషం ఆర్డర్!

​భార్యను చంపడానికి ఎవరికీ అనుమానం రాకూడదని కిరణ్ ఇంటర్నెట్‌లో వెతికి మరీ 80 వేల రూపాయల విలువైన విష పదార్థాన్ని తెప్పించాడు. గత నెల 26వ తేదీన పద్మను ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చాడు.

పాలకోవాలో విషం కలిపి.. దిండుతో అదిమి..

గత నెల 29న రాత్రి సమయం చూసి, పద్మకు ఇష్టమైన పాలకోవాలో విషాన్ని కలిపి ఇచ్చాడు. అది తిన్న పద్మ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, కిరాతక భర్త అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై దిండును గట్టిగా అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాటకమాడాడు.

​పోస్టుమార్టంతో వెలుగులోకి వాస్తవాలు:

​మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా లోతుగా విచారణ జరిపారు. పోలీసుల విచారణలో నిందితుడు కిరణ్ తన నేరాన్ని అంగీకరించాడు. కేవలం భార్య లావుగా ఉందన్న కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ​పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో వన్ టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు కీలక పాత్ర పోషించారు. ఒక చిన్న కారణంతో పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుని, కన్నకూతురిని అనాథను చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story