ప్రియుడితో భార్య జంప్.. స్నేహితురాలి ఫిర్యాదుతో బయటపడిన "దృశ్యం" స్టోరీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-20 07:50:27  IST  )

దేశరాజధాని ఢిల్లీలో ఉలిక్కిపడే సంఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వాములను..

ప్రియుడితో భార్య జంప్.. స్నేహితురాలి ఫిర్యాదుతో బయటపడిన దృశ్యం స్టోరీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో ఉలిక్కిపడే సంఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్న కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో.. తాజాగా వెలుగుచూసిన ఘటన దృశ్యం సినిమాను తలపిస్తోంది. మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను చంపి పాతేసిన భర్త.. ఆపై సినిమా స్టోరీని అల్లేశాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు విన్నవారెవరికైనా దృశ్యం సినిమానే గుర్తొస్తుంది.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకిత్ చాహౌన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాకు చెందిన షబాబ్ అలీ (47) పెయింటర్ గా పనిచేస్తున్నాడు. భార్య ఫాతిమా (30)కు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా అలీకి అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే ఫాతిమాకు ఐదురోజుల పాటు నిద్రమాత్రలు ఇచ్చి.. ఆపై పురుగుల మందు తాగించి హత్య చేశాడు. తన స్నేహితులైన షారుఖ్ ఖాన్, తన్వీర్ ల సహాయంతో ఫాతిమా మృతదేహాన్ని కారులో మెహ్రౌలిలోని ఒక శ్మశానవాటికకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఆమె శరీరంపై ఉన్న దుస్తుల్ని సమీపంలోని కాలువలో పడేశాడు. అంతా పూర్తయ్యాక ఏమీ తెలియని వాడిలా తిరిగి తన సొంతూరికి వెళ్లిపోయాడు.

మరుసటిరోజు ఫాతిమా ఫోన్ నుంచి తనకు తానే మెసేజ్ పంపుకున్నాడు. తాను ఇంటి నుంచి తన ప్రియుడితో పారిపోయానని, వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని ఆ మెసేజ్ లో ఉంది. ఫాతిమా మిస్సింగ్ పై ఆమె స్నేహితురాలికి అనుమానం రావడంతో ఆగస్టు 10న మెహ్రౌలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. తనను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొనగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఫాతిమా భర్త, అతని స్నేహితులు ఆమెను అపస్మారక స్థితిలో తీసుకెళ్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. వెంటనే భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. కానీ.. దర్యాప్తును దారిమళ్లించేందుకు మృతదేహాన్ని కాలువలో విసిరేశానని చెప్పాడు.

ఎక్కడా మృతదేహం ఆనవాలు కనిపించకపోవడంతో పోలీసులు మరోసారి అలీని విచారించారు. శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు చెప్పగా.. ఆగస్టు 15న ఆమె మృతదేహాన్ని పోలీసులు తవ్వితీసి, పోస్టుమార్టంకు పంపారు. అలాగే ఫాతిమాను హతమార్చిన తీరును కూడా వివరించాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త, మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story