చేపల వేటకు వెళ్లిన భర్త నదిలో గల్లంతు.. ప్రాణాలతో బయటపడిన భార్య

by Taduka Kalyani |

కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ గిరిజన దంపతుల్లో భర్త ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చేపల వేటకు వెళ్లిన భర్త నదిలో గల్లంతు.. ప్రాణాలతో బయటపడిన భార్య
X

దిశ, కొల్లాపూర్: కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ గిరిజన దంపతుల్లో భర్త ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య ప్రాణాలతో బయటపడగా, భర్త ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. అమరగిరి గ్రామ మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం నల్లమల అడవిలోని అమరగిరి చెంచు గూడెంకు చెందిన కాట్రాస్ బాలయ్య (35) తన భార్య నర్సమ్మతో కలిసి ఈ నెల 25న సాయంత్రం చేపల వేట కోసం సమీపంలోని కృష్ణా నదికి వెళ్లారు. నదిలోని కోతిగుండు ప్రాంతంలో చేపల వల వేస్తున్న సమయంలో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు పడవ అదుపుతప్పి బాలయ్య నదిలో పడిపోయినట్లు తెలిపారు. భర్తను రక్షించేందుకు భార్య నర్సమ్మ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అదే పడవలో రాత్రి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు, గూడెం వాసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై నర్సమ్మ ఆదివారం కొల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు గూడెం వాసులు వలల సాయంతో నదిలో గాలించినప్పటికీ బాలయ్య ఆచూకీ లభించలేదని మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ తెలిపారు. మృతుడికి భార్య నర్సమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Next Story