భార్యా భర్తల ఆత్మహత్యాయత్నం

by Nallavelli.Anjaneyulu |

అప్పులు అధికం కావ‌డంతో త‌ల్లి మంద‌లించ‌డంతో భార్య‌, భ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. భార్య మృతి చెంద‌గా.. భ‌ర్త చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

భార్యా భర్తల ఆత్మహత్యాయత్నం
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మురుగని రవి (25 ) ఆయన భార్య మురుగని లావణ్య (22) తమ వ్యవసాయ పొలం దగ్గర గల చింత చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. రవి భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్సలు పొందుతున్న రవి ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నది. ఈ సంఘటనకు సంబంధించి జంగమయ్యపల్లి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటీవల రవి గృహ నిర్మాణం కోసం గేదెల కొనుగోలు కోసం అప్పులు చేశాడు. అప్పులు అధికం కావడంతో బుధవారం రాత్రి ఆయన తల్లి పద్మమ్మ అప్పుల విషయమై రవిని తీవ్రంగా మందలించింది.

దీంతో తీవ్ర మనస్థాపానిగురైన రవి తనతో పాటు తన భార్య లావణ్యను 11 నెలల వయసు గల తన కూతురును వెంట తీసుకుని తమ గ్రామ సమీపంలో గల వ్యవసాయ పొలంలోని పశువులపాకలో నిద్రించాడు. గురువారం తెల్లవారిన తర్వాత సమీపంలోని కొల్లూరు గ్రామానికి వెళ్లి టిఫిన్ పార్సిల్ తెచ్చుకొని భార్యాభర్తలు భుజించారు. అనంతరం కొంతసేపు భార్యాభర్తలు చర్చించుకొని చివరకు తమకు చావే శరణ్యమని భావించి, తమ వెంట తీసుకెళ్లిన కూతురును ఉయ్యాలలో పరుండబెట్టి చెట్టుకు ఉరి తాళ్లు బిగించుకున్నారు. గొంతులకు ఉరి తాళ్లు బిగించుకున్న తర్వాత రవి హైదరాబాద్ పట్టణంలో ఉంటూ జీవనోపాధి పొందుతున్న తన తమ్ముడు ఆనంద్ కు వీడియో కాల్ చేసి తాము ఇక బ్రతకలేమని అందువల్ల ఉరివేసుకొని చనిపోతున్నామని చెప్పి కాళ్ల క్రింద ఉన్న డ్రమ్ములను తోసి వేశాడు. దాంతో హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఆనంద్ తమ గ్రామస్తులకు ఫోన్ ద్వారా విషయం తెలిపి తమ వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లి తన అన్న వదినలను కాపాడాలని అభ్యర్థించాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపే ఉరితాడు బిగుసుకుపోయిన లావణ్య మృతి చెందింది. రవి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా ఆయనను వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి పరిస్థితి విషమంగా ఉంది. లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల నుంచి ఇంకా ఏ విధమైన ఫిర్యాదు అందలేదని ఎస్సై విక్రమ్ తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Next Story