అద్దె వివాదం విషాదంలోకి.. పెట్రోల్ పోసుకుని హోటల్ యజమాని ఆత్మహత్య

by Bhanu |

అద్దె వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అద్దె వివాదం విషాదంలోకి.. పెట్రోల్ పోసుకుని హోటల్ యజమాని ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : అద్దె వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హోటల్ యజమాని లక్కంశెట్టి ఆదినారాయణ (52) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన రెండు రోజుల చికిత్స అనంతరం మరణంతో ముగిసింది.

సూర్యాపేట జిల్లా నకిరేకల్‌కు చెందిన ఆదినారాయణ భార్య పిల్లలతో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్నారు. అక్కడే 2021 నుంచి "శ్రీ తులసి టిఫిన్స్" పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే గత 18 నెలలుగా స్థల యజమాని సుధారాణికి అద్దె చెల్లించకపోవడంతో వివాదం తలెత్తింది.

ఇంతకుముందు సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆదినారాయణ హోటల్ ఖాళీ చేయేందుకు 6 నెలల సమయం కోరాడు. కానీ స్థల యజమాని కేవలం ఒక నెల సమయం మాత్రమే ఇస్తానని పేర్కొంది. అనంతరం ఆదినారాయణ కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సుధారాణి తన అనుచరులను పంపించి హోటల్‌లోని సామాన్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు.

దీంతో మనస్థాపానికి గురైన ఆదినారాయణ అక్కడికక్కడే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సమీపంలో ఉన్న వారు మంటలు ఆర్పి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా, 40శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

పరిణామంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురైన కుటుంబ సభ్యులు, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story