- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల (Jagityal) జిల్లాలో మాటలకు అందని ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆటలాడుకుంటూ వెళ్లిన ముగ్గురు అమాయక చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మేడిపల్లి (Medipally) మండల పరిధిలోని కొండపూర్ (Kondapur) గ్రామంలో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో ఒకేసారి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొండపూర్ గ్రామానికి చెందిన కొందరు భక్తులు శివగంగ ఆలయం వద్ద మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే మనవిత్ (10), మనస్విని (9), షర్వింద్ (7) అనే ముగ్గురు చిన్నారులు సమీపంలోని కోనేరులోకి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటి నుంచి బయటకు రాలేక ఊపిరాడక ముగ్గురూ నీటిలోనే ప్రాణాలు విడిచారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..
చిన్నారులు కోనేరులో పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే మేడిపల్లి పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికుల సాయంతో కోనేరులో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ముక్కుపచ్చలారని చిన్నారుల శవాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






