EHS: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. ఈహెచ్‌ఎస్ కోతపై హైకోర్టు‌లో విచారణ

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్‌ఎస్ పేరిట 1.5 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కోత విధించడాన్ని సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

EHS: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. ఈహెచ్‌ఎస్ కోతపై హైకోర్టు‌లో విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్‌ఎస్ పేరిట 1.5 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కోత విధించడాన్ని సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ దాఖలైన ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు మంజూరు చేస్తూ. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని కుష్టువ్యాధి నివారణ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ జీ.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రాజ్ కుమార్ గుమ్మి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే, బేసిక్ పెన్షన్ నుంచి ఈహెచ్ఎస్ కోసం 1.5 శాతం మినహాయించేలా ఆర్థిక శాఖ ఇటీవల జూన్ 29, 2026న జీవో నం.79ని జారీ చేసిందని, ఇది అంతకు ముందు అక్టోబర్ 8, 2023న జారీ చేసిన జీవో నం.186 ఆధారంగా వెలువడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఉమ్మడి రాష్ట్రంలో అమలైన 1972 నాటి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ టీమా.. నిబంధనలే ప్రస్తుతం తెలంగాణకు కూడా వర్తిస్తాయని గుర్తుచేశారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలా వారి వేతనాల నుంచి తప్పనిసరిగా చందాలు వసూలు చేయడం ఆ నిబంధనలకు పూర్తి విరుద్ధమని వాదించారు. ఆ రెండు జీవోలను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఇప్పటికే కోత విధించిన మొత్తాన్ని ఉద్యోగులకు తిరిగి చెల్లించేలూ ఆదేశాలివ్వాలని కోరారు. దీనికి తోడు, గతంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంతో పాటు ఈహెచ్ఎస్ స్కీమ్ రెండూ సమాంతరంగా కొనసాగేలా ప్రభుత్వం 2014 నవంబర్ 3న జీవో నం.32 జారీ చేసిందని, అప్పటి నుంచి 2025 వరకు వరుస ఉత్తర్వులు ఇచ్చిందని న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న జారీ చేసిన జీవో నం.67లో సైతం ఈ రెండు విధానాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారే తప్ప, జీవో 186 ప్రస్తావన తేలేదని వాదించారు.

పిటిషనర్ వాదనలు విన్న అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులు 1 నుంచి 3 తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ అదనపు అడ్వకేట్ జనరల్ కార్యాలయ అనుబంధం ఎస్. రాహుల్ రెడ్డి స్పందించారు. ఈ కేసు పూర్వాపరాలపై సంబంధిత శాఖల అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తికి అంగీకరించిన సీజే ధర్మాసనం.. కేసు తదుపరి విచారణను 2026, ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story