AIతో హైటెక్ మాస్ కాపీయింగ్.. పట్టుబడిన ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 10:57:04  IST  )

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (నాన్-టీచింగ్) పోస్టుల నియామకాల కోసం జరిగిన రాత పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

AIతో హైటెక్ మాస్ కాపీయింగ్.. పట్టుబడిన ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (నాన్-టీచింగ్) పోస్టుల నియామకాల కోసం జరిగిన రాత పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 21న గచ్చిబౌలిలోని HCU క్యాంపస్‌లో పరీక్ష రాస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అనిల్ అనే అభ్యర్థి, షర్టు బటన్లలో అమర్చిన చిన్న మైక్రో స్కానర్‌తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి బయటున్న వ్యక్తులకు పంపుతున్నట్లు ఇన్విజిలేటర్లు గమనించారు. ఆ స్కాన్ చేసిన సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో తక్షణమే సమాధానాలు సృష్టించి పంపినట్లు నిర్ధారణ అయింది.

సరిగ్గా ఇదే విధంగా మరో హర్యానా యువకుడు సతీశ్ కూడా అదే పద్ధతిలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడని ఇన్విజిలేటర్లు గుర్తించారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు ఇద్దరినీ పట్టుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ (Devesh Nigam) చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కాపీయింగ్‌కు వినియోగించిన మైక్రో స్కానర్లు, సంబంధిత పరికరాలను, మైక్రో బ్లూటూత్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

Next Story